ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన విదేశీ బృందం……

ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన విదేశీ బృందం……

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రకృతి వ్యవసాయ ప్రభావాన్ని నెదర్లాండ్స్ వాగెనింగెన్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం మంగళవారం మండల పరిధిలోని అన్నిగండ్లపాడు గ్రామంలో అధ్యయనం చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ (రైస్స్) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్‌డ్ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీన్ఫ్) కార్యక్రమ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి నెదర్లాండ్స్ దేశానికి చెందిన వాగెనింగెన్ యూనివర్సిటీ & రీసెర్చ్ ప్రతినిధి బృందం పర్యటించారు. ఈ బృందంలో గ్రెట్, సౌమ్య, కళ్యాణ్, సైమన్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ మిర్చి ప్రకృతి వ్యవసాయ మోడల్ ను ప్రత్యక్షంగా పరిశీలించి, రైతులు అనుసరిస్తున్న ప్రకృతి ఆధారిత పద్ధతులు, పంటల దిగుబడులు నాణ్యత గురించి తెలుసుకున్నారు. అలాగే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఏర్పాటు చేసిన మార్కెటింగ్ లింకేజెస్ గురించి అధికారులు వివరించారు. రైతు గోవర్ధన్ అమలు చేస్తున్న ఎటిఎం మోడల్ ను కూడా ప్రతినిధి బృందం పరిశీలించి, ఆ మోడల్ ద్వారా రైతులకు లభిస్తున్న అదనపు ఆదాయం గ్రామీణ స్థాయిలో ప్రకృతి వ్యవసాయం విస్తరణపై వివరాలు తెలుసుకున్నారు.

తదుపరి ప్రతినిధులు గ్రామంలోని బయో రిసోర్స్ సెంటర్ ( బి ఆర్ సి ) ను సందర్శించి ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన జీవ ఉత్ప్రేరకాలు, బయో ఇన్‌పుట్ తయారీ విధానాలు రైతులకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల ఖర్చులు తగ్గడం, నేల ఆరోగ్యం మెరుగుపడటం, పంటల నాణ్యత పెరగడం రైతుల ఆదాయం పెరుగుతున్న విషయాలను అధికారులు రైతులు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళీధర్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వై. శంకర్ నాయక్, రైతు సాధికార సంస్థ జిల్లా బృందం, అధికారులు, రైతులు, కేడర్లు పాల్గొన్నారు.

Leave a Reply