రైతు సంగ్రామ సభకు భారీగా తరలిన రైతులు..

ధర్మసాగర్, ఆంధ్రప్రభ ; భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో వరంగల్‌లో బుధవారం నిర్వహించనున్న రైతు సంగ్రామ సభకు ధర్మసాగర్ మండలం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా బయలుదేరారు. మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులు ట్రాక్టర్లు, వాహనాలతో భారీ ర్యాలీగా సభకు తరలివెళ్లడం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మాజీ పీఏసీఎస్ చైర్మన్, వరంగల్ డీసీసీబీ డైరెక్టర్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి హాజరై పార్టీ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తోందని తెలిపారు. రైతాంగానికి న్యాయం జరిగే వరకు ఉద్యమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు ఎరువుల ధరలు, సాగునీటి సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతు సంక్షేమమే బిఆర్ఎస్ లక్ష్యమని ఆయన అన్నారు. వరంగల్‌లో జరిగే రైతు సంగ్రామ సభ రైతాంగ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఈ యాత్రలో మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు లాల్ మహ్మద్, బొడ్డు ప్రతాప్, దంతూరి బాలరాజు, మెరుగు రాజిరెడ్డి, బొక్క దయాకర్, రైతు సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
