అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ…

అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ…

ఇకనైనా రాజకీయ నాటకాలు ఆపాలి
రైతుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
టిడిపి రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాదు.

విజయవాడ ఆంధ్రప్రభ : అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి వైసిపి అడ్డంకిగా నిలుస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్నా) విమర్శించారు. అమరావతి అభివృద్ధి అంశంపై ప్రతిపక్షాల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. అమరావతి ప్రాంత రైతుల హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం ఎప్పటికీ రాజీ పడదని స్పష్టం చేశారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు పూర్తిగా అందే వరకు కౌలు (రెంట్) చెల్లింపులు కొనసాగించడం ప్రభుత్వ బాధ్యతగా కొనసాగుతుందని తెలిపారు.

అభివృద్ధిలో ఆలస్యం జరిగినా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా పెండింగ్ చెల్లింపులు క్లియర్ చేస్తూ ప్రభుత్వం తన నిబద్ధతను చాటుతోందన్నారు. గతంలో అమరావతిని అణిచివేసిన వారే ఇప్పుడు రైతులపై ప్రేమ చూపిస్తూ రాజకీయ లాభాలు పొందాలని ప్రయత్నించడం అనైతికమని విమర్శించారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకత్వం రాజధాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

రాజధాని అంశంపై గతంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలు గమనించి ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. అయినప్పటికీ వాస్తవాలను అంగీకరించకుండా కొత్త నాటకాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కొన్ని ప్రాంతాల్లో రైతుల హక్కుల రక్షణ కోసం కౌలు చెల్లింపులు నిరంతరం కొనసాగుతున్నాయని, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. ఈ అంశాన్ని కూడా వక్రీకరించి అబద్ధ ప్రచారాలు చేయడం ప్రతిపక్షాల దిగజారుడు రాజకీయాలకు ఉదాహరణగా పేర్కొన్నారు.

అమరావతిపై విద్వేషంతోనే ఈ విధమైన దుష్ప్రచారాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, పార్లమెంటులో అమరావతికి వ్యతిరేకంగా వ్యవహరించిన వైఖరిని గుర్తుచేశారు. రైతుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మానుకుని నిజాలను అంగీకరించాలని వైసీపీకి సూచించారు. అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గన్నే ప్రసాద్ స్పష్టం చేశారు.

Leave a Reply