మాంటిస్సోరి విద్యాసంస్థల స్వర్ణోత్సవాల సందర్భంగా ఆరోగ్య అవగాహన ర్యాలీ
డెంగ్యూ, రేబీస్ నివారణ.. పరిశుభ్రత, రక్తదానంపై ప్రజలకు చైతన్యం
రాప్తాడు, ఆంధ్రప్రభ: మాంటిస్సోరి విద్యాసంస్థల స్వర్ణోత్సవాలు, సంస్థ వ్యవస్థాపకురాలు కళ్యాణమ్మ వర్ధంతి సందర్భంగా మాంటిస్సోరి ఎలైట్ స్కూల్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన ర్యాలీ నిర్వహించారు.
రాప్తాడు మండల పరిధిలోని గొల్లపల్లి సమీపంలోని మాంటిస్సోరి ఎలైట్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు డెంగ్యూ, రేబీస్ నివారణ, పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం, రక్తదానం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
“ఆరోగ్యమే మహాభాగ్యం”, “పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యానికి పునాది”, “డెంగ్యూ–రేబీస్ వ్యాధులను నివారిద్దాం” వంటి నినాదాలతో గ్రామ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ స్వర్ణోత్సవ వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. వ్యవస్థాపకురాలు కళ్యాణమ్మ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం చేపడతామని తెలిపారు.
స్థానిక ప్రజలు ర్యాలీని అభినందిస్తూ విద్యార్థులు చేపట్టిన అవగాహన కార్యక్రమాన్ని ప్రశంసించారు.
