ఎవరూ ఆందోళన చెందొద్దు….
అందరికీ న్యాయం జరిగేలా చూస్తాం…
రామరాజ్యనగర్ కుటుంబాలకు ఎంపీ కేశినేని చిన్ని భరోసా..
రైల్వే భూమి వివాదంతో అనిశ్చితిలో ఉన్న బాధితులకు అండగా నిలిచిన ఎంపీ..
కలెక్టర్‌తో ప్రత్యేకంగా చర్చించి ప్రత్యామ్నాయ స్థలాలపై సానుకూల నిర్ణయానికి కృషి చేస్తానని హామీ..
ముఖ్యమంత్రి దృష్టికి ఇప్పటికే సమస్యను తీసుకెళ్లినట్లు వెల్లడి
చట్టబద్ధమైన పరిష్కారంతో ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తామని స్పష్టం..
నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి బాధాకరమన్న ఎంపీ..
బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని అభయం..
విజయవాడ, ఆంధ్రప్రభ : రామరాజ్యనగర్‌కు చెందిన సుమారు 400 కుటుంబాల ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని భరోసా ఇచ్చారు. రైల్వే భూమిలో గతంలో కేటాయించిన ఇళ్ల పట్టాల కారణంగా ప్రస్తుతం అనిశ్చితిలో ఉన్న కుటుంబాలకు చట్టబద్ధమైన పరిష్కారం చూపించే దిశగా జిల్లా యంత్రాంగంతో చర్చించి సాధ్యమైనంత మేరకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు తమ వంతు ప్రయత్నం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీ కార్యాలయంలో గురువారం రామరాజ్యనగర్‌కు చెందిన సుమారు 400 కుటుంబాల ప్రతినిధులు ఎంపీని కలిసి తమ సమస్యను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రైల్వేకు చెందిన భూమిలో తమకు ఇళ్ల పట్టాలు కేటాయించారని, ప్రస్తుతం రైల్వే అధికారులు ఆ స్థలాలను ఖాళీ చేయాలని సూచిస్తున్నారని వినతిపత్రం సమర్పించారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి వినతిని శ్రద్ధగా విన్న ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, ఈ సమస్యను జిల్లా కలెక్టర్‌తో జరిగే సమావేశంలో ప్రధాన అంశంగా ప్రస్తావిస్తానన్నారు. చట్టపరంగా అవకాశం ఉంటే ప్రస్తుతం కేటాయించిన స్థలాలకు బదులుగా ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపుపై అధికారులతో సమగ్రంగా చర్చిస్తానని తెలిపారు. ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని మార్గాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యను ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావుతో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ వెల్లడించారు. జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి ప్రజలకు నష్టం జరగకుండా పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను వదిలి వెళ్లాలని చెప్పడం ఏ కుటుంబానికైనా తీవ్ర మనోవేదన కలిగించే విషయమేనని ఎంపీ అన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వారి నివాస హక్కులకు భంగం కలగకుండా చట్టబద్ధంగా సాధ్యమైన ఉత్తమ పరిష్కారాన్ని అందించే దిశగా కృషి కొనసాగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుమతి లభిస్తే మెరుగైన ప్రాంతంలో ఇళ్ల పట్టాలు కేటాయించే అంశంపైనా చర్చిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు, గొల్లపూడి టీడీపీ అధ్యక్షుడు నూతలపాటి నారద, ఏఎంసీ చైర్మన్ నర్రా వాసు తదితరులు పాల్గొన్నారు.
