పదోన్నతితో పెరిగిన బాధ్యతలు..

పదోన్నతితో పెరిగిన బాధ్యతలు..

ప్రజాసేవలో మరింత నిబద్ధత చూపాలి

సీఐలుగా పదోన్నతి పొందిన అధికారులకు డీఐజీ కోయ ప్రవీణ్ అభినందనలు

కర్నూలు, ఆంధ్రప్రభ: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ పోలీసు శాఖ గౌరవాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సూచించారు. ఇటీవల సబ్‌ఇన్‌స్పెక్టర్లుగా విధులు నిర్వహిస్తూ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన అధికారులు మంగళవారం కర్నూలులోని రేంజ్ డీఐజీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులను డీఐజీ అభినందించారు. పదోన్నతి అనేది కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాదని, దానికి అనుగుణంగా బాధ్యతలు కూడా మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ చట్టబద్ధంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో పోలీసు శాఖపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా పనిచేయాలని సూచించారు. పోలీసు సేవల పట్ల ప్రజలకు నమ్మకం పెరిగేలా ప్రతి అధికారి తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.

సీఐలుగా పదోన్నతి పొంది డీఐజీని కలిసిన వారిలో ఎ.పి. శ్రీనివాసులు, జీవన్‌రెడ్డి, ముత్యాల శ్రీనివాసులు, ధనుంజయ, తిమ్మయ్య, లక్ష్మీనారాయణ, హనుమంతయ్య, లలిత ఉన్నారు.

ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారులు తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాసేవలో మరింత నిబద్ధతతో పనిచేస్తామని పేర్కొంటూ డీఐజీకి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply