Farmer | యూరియా కోసం… గడ్డ కట్టే చలిలో..

Farmer | యూరియా కోసం… గడ్డ కట్టే చలిలో..
- తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లలో నిల్చున్న రైతులు
- పనిచేయని యాప్… చోద్యం చూస్తున్న అధికారులు
Farmer | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : యాసంగి సీజన్ లో సైతం రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. గడ్డకట్టే చలిలో సైతం రైతులు కుటుంబ సభ్యులతో సహా యూరియా కోసం క్యూ లైన్లో నిల్చున్న దృశ్యాలు బుధవారం కనిపించాయి. చెన్నారావుపేట, ఉప్పరపల్లి, ఎల్లాయిగూడెం గ్రామాల్లో యూరియా ఇస్తున్నారనే సమాచారం తెలుసుకున్న రైతులు తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకే స్వెట్టర్లు ధరించి చద్దర్లు, రగ్గులు కప్పుకుని ఒక్క యూరియా బస్తా కోసం వేచి చూశారు.
కొంతమంది రైతులు మాత్రం నిద్ర మానుకుని లైన్ లో ఉన్నా బస్తాలు దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత లేదని, వ్యవసాయానికి కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని, ఫర్టిలైజర్ యాప్ లో యూరియా బుక్ చేసుకుంటే డీలర్ దగ్గరకు వెళ్లి తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, జిల్లా కలెక్టర్ చెబుతున్నా అవి ఏమాత్రం అమలు కావడం లేదు. యూరియా యాప్ పనిచేయడం లేదు. మండలంలో ఓ గ్రామానికి చెందిన రైతు ప్రభుత్వం సూచించిన ఫర్టిలైజర్ యాప్ లో లాగిన్ అయి యూరియా బస్తాలు బుక్ చేసుకుంటే అధికారుల వద్ద లాగిన్ అవడం లేదంటూ కారణాలు చెబుతూ 24గంటలు దాటిందని సదరు రైతుకి యూరియా బస్తాలు ఇవ్వలేదు.

ఎక్కడ చూసినా భారీ సంఖ్యలో రైతులు, మహిళలు ఇంటిల్లిపాధి యూరియా కోసం లైన్ లో ఉన్న దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి. ఎల్లాయిగూడెంలో రెండు, మూడు గంటల నుండే రైతులు యూరియా టోకెన్ల కోసం నిల్చున్నారని, మళ్లీ యూరియా కోసం అమీనాబాద్ కు వెళ్లి తెచ్చుకోవాలని అక్కడి రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యాప్ పని చేసేలా చూసి, గ్రామాల వారీగా యూరియా సకాలంలో అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
