AP | ఆధునిక విజ్ఞాన కేంద్రాలుగా గ్రంథాలయాలు…
గ్రంథాలయాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో జిల్లా చైర్మన్ ఎం ఎస్ బేగ్ భేటీ
లైబ్రరీ సెస్సు నిధుల విడుదలకు కృతజ్ఞతలు
AP | (విజయవాడ, ఆంధ్రప్రభ) : రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థల అభివృద్ధి, నిధుల విడుదల, ఆధునికీకరణ అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్‌లు బుధవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ ఇతర జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్‌లతో కలిసి గ్రంథాలయాల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా గ్రంథాలయ సంస్థల ఖాతాలకు లైబ్రరీ సెస్సు నిధులను నేరుగా విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చైర్మన్‌లు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రంథాలయాల అభివృద్ధికి సకాలంలో నిధులు అందించడం ద్వారా యువతకు విద్య, విజ్ఞానం, పోటీ పరీక్షల సన్నద్ధత, సాంస్కృతిక వికాసానికి దోహదపడే కేంద్రాలుగా గ్రంథాలయాలను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దూరదృష్టిని అభినందించారు. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల్లో డిజిటల్ సౌకర్యాలు, ఆధునిక మౌలిక వసతులు, పోటీ పరీక్షల విభాగాలు, ఈ-లైబ్రరీ సేవలను విస్తరించి, యువతకు మరింత ఉపయోగకరమైన విజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రిని కోరారు.
