Seed Prices | విత్తనాల ధరలకు రెక్కలు..
సన్న వడ్ల బోనస్ ఎఫెక్ట్..
రైతులపై అదనపు భారం!
ఏడు రకాల సన్న వరికే బోనస్ ప్రకటించడంతో పెరిగిన డిమాండ్..
10 కిలోల బ్యాగుపై రూ.150-200 వరకు ధరల పెంపు
ధరల నియంత్రణ లేక సీడ్ కంపెనీల ఇష్టారాజ్యం..
లాభాల కోసం రైతుల జేబులకు చిల్లు
Seed Prices | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రైతులకు ఊరటనివ్వాల్సి ఉండగా, సీడ్ కంపెనీల ధరల పెంపుతో ఆ ప్రయోజనం నీరుగారే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న వరి విత్తనాలకే బోనస్ వర్తిస్తుందని ప్రకటించడంతో వాటికి మార్కెట్లో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. ఇదే అవకాశంగా భావించిన విత్తన కంపెనీలు ఒక్కో బ్యాగుపై రూ.150 నుంచి రూ.200 వరకు ధరలు పెంచడంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.
తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్ నుంచి ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్న వరి పంటలకు మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులు పెద్దఎత్తున అదే రకాల విత్తనాల కోసం డీలర్లను ఆశ్రయిస్తున్నారు. పెరిగిన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ సీడ్ కంపెనీలు ధరలను అమాంతం పెంచేశాయని రైతులు ఆరోపిస్తున్నారు.
సీడ్ కంపెనీలు ఇంధన ధరలు, రవాణా ఖర్చులు పెరిగాయని కారణాలు చెబుతున్నప్పటికీ, వాస్తవానికి పెరిగిన డిమాండ్‌ను లాభాలుగా మలుచుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పత్తి విత్తనాల మాదిరిగా వరి విత్తనాల ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో కంపెనీలు తమకు నచ్చినట్లు ధరలు నిర్ణయిస్తున్నాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.
ఒక్కో బ్యాగుపై రూ.200 వరకు పెంపు
గత ఏడాది 10 కిలోల సన్న వరి విత్తనాల బ్యాగు రూ.900కు లభించగా, ప్రస్తుతం అదే బ్యాగు రూ.1,050 నుంచి రూ.1,100 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న కొన్ని ప్రముఖ రకాల విత్తనాల గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ) రూ.1,510గా ఉండగా, డీలర్లు వాటిని రూ.1,200 నుంచి రూ.1,250 వరకు విక్రయిస్తున్నారు.
మరోవైపు పోటీ కారణంగా కొంతమంది డీలర్లు ధరలు తగ్గించి విక్రయించాలని ప్రయత్నించినా, కంపెనీలు నిర్దేశించిన ధర కంటే తక్కువకు అమ్మొద్దని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో రైతులకు తక్కువ ధరకు విత్తనాలు అందే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి.
ఈ రెండు రకాలకే ఎక్కువ డిమాండ్
ప్రభుత్వం బోనస్‌కు అర్హత కల్పించిన బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, కేఎన్ఎం-1638, కేఎన్ఎం-7715, డబ్ల్యూజీఎల్-44 రకాలలో ముఖ్యంగా జైశ్రీరామ్, తెలంగాణ సోనా రకాలకే అత్యధిక డిమాండ్ కనిపిస్తోంది.
ఈ రెండు రకాల పంట కాలం తక్కువగా ఉండటం రైతులను ఆకర్షిస్తోంది. బీపీటీ రకం పంటకు సుమారు 150 రోజులు పడుతుండగా, జైశ్రీరామ్‌కు సుమారు 130 రోజులు, తెలంగాణ సోనాకు 110 నుంచి 120 రోజుల్లోనే కోతకు వస్తుంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు స్వల్పకాలిక రకాల వైపే మొగ్గు చూపుతున్నారు.
అదనంగా మార్కెట్లో జైశ్రీరామ్, తెలంగాణ సోనా రకాల ధాన్యానికి మంచి గిరాకీ ఉంది. గత సీజన్లో మిల్లర్లు, వ్యాపారులు ఈ రకాల ధాన్యాన్ని క్వింటాలుకు రూ.3,000 నుంచి రూ.3,200 వరకు కొనుగోలు చేయడంతో ఈసారి కూడా రైతులు అదే రకాల సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
90 శాతం విస్తీర్ణంలో సన్నాలే?
మంచిర్యాల జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో సుమారు 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కారణంగా ఈసారి దాదాపు 90 శాతం విస్తీర్ణంలో సన్న వరి సాగు జరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అవసరమైన విత్తనాలు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ స్పష్టం చేస్తోంది.
సన్న వరి సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గత నెల 23 నుంచి 30 వరకు రైతు వేదికల్లో ప్రత్యేక సీడ్ మేళాలు నిర్వహించి ప్రైవేట్ డీలర్ల ద్వారా విత్తనాల విక్రయాలు చేపట్టింది. అయితే ఆశించిన స్థాయిలో రైతులు స్పందించకపోవడంతో ఎక్కువ మంది నేరుగా డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.
అయితే, ప్రభుత్వం ప్రకటించిన బోనస్ వల్ల లభించే ప్రయోజనం కంటే ముందుగానే విత్తనాల ధరలు పెరగడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ధరల నియంత్రణపై ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని సీడ్ కంపెనీల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
