వావ్.. ఫేక్ లోన్స్..
రూ. 85 లక్షలు స్వాహా.. పైగా అది నకిలీ గోల్డ్
చిన్నగొట్టిగల పీఏసీఎస్ లో భారీ కుంభకోణం
గత పాలక మండలి, అధికారులు, అప్రైజర్లపైనే ఆరోపణలు
( చిత్తూరు. ఆంధ్రపభ బ్యూరో)
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో (పాక్స్) అట్టహాసంగా సాగిన భారీ అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. వాస్తవ బంగారం కాకుండా నకిలీ వన్‌గ్రామ్ గోల్డ్ నగలను బంగారంగా చూపించి కోట్ల రూపాయల రుణాలు మంజూరుచేయడం ఈ సంఘటనలో ముఖ్యాంశం. ఈ కుంభకోణం 2020 నుండి 2025 మధ్యకాలంలో చోటుచేసుకున్నట్లు తాజా విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. సింగిల్ విండో అధ్యక్షుడు ముత్తం ప్రభాకర్ ఈ అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మేనేజర్ స్థాయి అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తనికీలు చేపట్టగా, నకిలీ నగల సొత్తు బయటపడింది. సుమారు 29 బ్యాంకుల వద్ద నుంచి నకిలీ వన్‌గ్రామ్ గోల్డ్ నగలను స్వాధీనం చేసుకున్నారు.
రెండు పేర్లతో నకిలీ రుణాలు
రెడ్డమ్మ, రూబెన్ పేర్లతో ఒకే వ్యక్తులు నాలుగు విడతల్లో రుణాలు పొందినట్లు డీసీసీబీ అధికారుల తనికీల్లో తేలింది. ప్రతి విడతలో వన్‌గ్రామ్ గోల్డ్ నగలను అసలైన బంగారంగా చూపించి మళ్లీ మళ్లీ రుణాలు తీసుకున్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. ఈ అక్రమాలకు అప్రైజర్, అప్పటి పాలక మండలి సభ్యులు, సిబ్బంది నేరుగా ప్రమేయం ఉన్నట్లు స్పష్టమవుతోంది. బంగారం నాణ్యతను సరిచూసే బాధ్యత కలిగిన అప్రైజర్ నకిలీ నగలను అసలైనవిగా ధృవీకరించి, రుణ మంజూరుకు సిఫార్సు చేశారని అధికారులు వెల్లడించారు. ఈ విధంగా దాదాపు 85 లక్షల రూపాయల విలువైన రుణాలు మంజూరయ్యాయి.
అంతర్గత దర్యాప్తుతో ..
మొదటగా ఈ వ్యవహారం అంతర్గత తనికీలలో బయటపడింది. స్థానిక స్థాయిలో బ్యాంకు నిర్వహించిన ఆడిట్లో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించడంతో విజిలెన్స్ బృందం రంగప్రవేశం చేసింది. అనంతరం డీసీసీబీ చైర్మన్ సమాస రాజశేఖర్ రెడ్డికి నివేదిక అందించగా, ఆయన ఈ అంశాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు.
డీసీసీబీ చైర్మన్ ఆగ్రహం
డీసీసీబీ చైర్మన్ సమాస రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకే గ్రామ గోల్డ్ నగలను బంగారంగా చూపించి రుణాలు పొందడం అంటే అత్యంత దారుణమైన అవినీతి. ఈ దందా వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్టు అనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలోని అన్ని కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఉంచిన నగలను తిరిగి తనిఖీ చేయమని ఆదేశించాను. నేరం చేసిన వారెవరైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
గత పాలక మండలి కాలంలోనే దందా
విజిలెన్స్ విభాగం నివేదిక ప్రకారం, ఈ కుంభకోణం గత ప్రభుత్వ పాలక మండలి కాలంలోనే ప్రారంభమైంది. 2019–2024 మధ్య కాలంలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని ఇప్పటికే నివేదికలు సూచించాయి. వ్యవసాయేతర భూములపై రుణాలు మంజూరు చేయడం, ఒకే వ్యక్తికి కోట్లాది రూపాయల రుణాలు ఇవ్వడం, నకిలీ పత్రాలతో రుణాలు మంజూరు చేయడం వంటి దందాలు కూడా వెలుగుచూశాయి. ఇప్పుడు బయటపడిన ఈ వన్‌గ్రామ్ గోల్డ్ కుంభకోణం ఆ అవినీతి వ్యవస్థకు కొనసాగింపుగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
బ్యాంకు అంతర్గత విచారణ అనంతరం డీసీసీబీ ఫిర్యాదు మేరకు పోలీసు దర్యాప్తు ప్రారంభమైంది. ప్రాథమిక విచారణ పూర్తయ్యాక, ఈ కేసును సీఐడీకి అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నకిలీ గోల్డ్ నగలను సమర్పించి రుణాలు పొందినవారిని, అలాగే వాటిని ధృవీకరించిన అప్రైజర్, సీఈఓ, పాలక మండలి సభ్యులను విచారణకు పిలిచే ప్రక్రియలో పోలీసులు ఉన్నారు.
ఇంకా మరిన్ని బ్యాంకుల్లోనూ?
చిన్నగొట్టిగల సంఘంలో జరిగిన ఈ కుంభకోణం ఒక్కటే కాదని అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తం చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక సహకార సంఘాల్లోని బంగారం నగలను తనిఖీ చేయమని డీసీసీబీ చైర్మన్ ఇప్పటికే ఆదేశించారు.
