Brahmotsavam |అంజన్న బ్రహ్మోత్సవానికి సర్వం సిద్ధం

Brahmotsavam | అంజన్న బ్రహ్మోత్సవానికి సర్వం సిద్ధం

  • నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 4 వరకు మద్దిమడుగు ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
  • 2న పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం
  • 3న సీతారాముల వారి కల్యాణోత్సవం, హనుమాన్‌ మహా పడిపూజ
  • విశిష్ట అతిథిగా త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌ స్వామి

Brahmotsavam | అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణలోని పవిత్ర పుణ్య క్షేత్రాలలో ఒకటైన నాగర్‌కర్నూల్‌ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, పదర మండలం, మద్దిమడుగు గ్రామం ప్రకృతి రమణీయమైన దట్టమైన అడవిలో మహిమాన్వితమైన, స్వయంభూగా వెలసిన పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు నిర్వాహ‌కుల‌కు స‌ర్వం సిద్ధం చేశారు. నవంబరు 30 నుంచి డిసెంబరు 4 వరకు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు, సేవాదారులు, మాజీ చైర్మన్‌ డి.రాములు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక శోభాయాత్రలు, హోమాలు, పూజావిధులు నిర్వహించేందుకు కమిటీ సభ్యుల సహకారంతో భారీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విశిష్ట అతిథులుగా త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌ స్వామి హాజ‌రై భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆశీర్వచనం అందిస్తార‌ని కార్య నిర్వహణాధికారి రంగాచార్యులు తెలిపారు.

Brahmotsavam | ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ

బ్రహ్మోత్సవాల నేప‌థ్యంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వివిధ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాల్లో గణపతి పూజ, అంకురార్పణ, పుణ్యాహవచనం, రుద్ర హోమం, చండీహోమం, మహామంగళహారతి, అన్నదానం త‌దిత‌ర కార్యక్రమాలు ఉంటాయి. డిసెంబర్‌ 2న రాత్రి 8 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, డిసెంబర్‌ 3న రాత్రి సీతారాముల కల్యాణం అనంతరం హనుమాన్‌ మహాపడి పూజ హనుమాన్‌ దీక్షా స్వాముల సమక్షంలో అత్యంత భక్తి శ్రద్ద‌లతో వైభవంగా జరుగనున్నాయి. డిసెంబర్‌ 4న ఆంజనేయ స్వామి వారికి 108 కలశములచే అష్టోత్తర శతకలశ స్నప‌న నిర్వహించబడును.

Brahmotsavam

Brahmotsavam | భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇత‌ర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్య‌లో భక్తుల వ‌చ్చే అవకాశం ఉన్నందున దేవస్థాన కమిటీ వసతి గృహాలతో పాటు పార్కింగ్‌, నీటి సదుపాయాలు, అన్నసత్రం, వైద్య శిబిరం త‌దిత‌ర‌ సౌకర్యాలు కల్పించారు. మహిళలు, వృద్ధులు సులభంగా దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

Brahmotsavam | దేవస్థాన కమిటీ వివరణ

పబ్బతి ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిపిస్తామని, ఈసారి మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు స్థానికుల సహకారంతో ఏర్పాట్లు చేశామని దేవస్థాన మాజీ ఛైర్మన్‌ రాములు నాయక్‌, కమిటీ సభ్యులు తెలిపారు.

Brahmotsavam

Brahmotsavam | నిత్య అన్నదానం

గత సంవత్సరం నుంచి మద్దిమడుగు క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దాతల సహకారంతో నిత్యాన్నదానాన్ని నిర్వహించనున్నారు. నిత్యాన్నదానం నిర్వ‌హ‌ణ‌కు భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని ఈఓ రంగాచార్యులు కోరుతున్నారు.

click here to read more

click here to read this ఇంద్రకీలాద్రిపై జనసంద్రం

Leave a Reply