విద్యార్థులకు కొత్త యూనిఫాంలు ఎక్కడ?
విద్యార్థులకు కొత్త యూనిఫాంలు ఎక్కడ?
పాఠశాలలు ప్రారంభానికి నాలుగు రోజులే.. పంపిణీపై స్పష్టత కరవు
యూనిఫాంలు, షూస్, బెల్ట్, ఎడ్యుకేషన్ కిట్‌పై ఎదురుచూపులు
నాగర్‌కర్నూల్, జూన్ 11 (ఆంధ్రప్రభ): ఈ నెల 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కొత్త యూనిఫాంల పంపిణీపై ఇంకా స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పాఠశాలల ప్రారంభానికి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ యూనిఫాంల సరఫరా, పంపిణీపై విద్యాశాఖ వద్ద కూడా స్పష్టమైన సమాచారం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
గత ఏడాది పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికే విద్యార్థులకు కొత్త యూనిఫాంలు అందించగా, ఈ ఏడాది ప్రభుత్వం యూనిఫాంలతో పాటు టై, బెల్ట్, షూస్, ఎడ్యుకేషన్ కిట్ కూడా అందిస్తామని ప్రకటించినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఆ ప్రక్రియలో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
గతంలో జిల్లా విద్యాశాఖకు యూనిఫాం వస్త్రాలు చేరిన తర్వాత వాటిని మహిళా సంఘాలకు అందజేసి కుట్టించే ప్రక్రియ చేపట్టేవారు. కానీ ఈసారి ఇప్పటివరకు వస్త్రాలే జిల్లాలకు చేరలేదని తెలుస్తోంది. పాఠశాలలు మూసివేసే ముందు విద్యార్థుల కొలతలను ప్రధానోపాధ్యాయులు సేకరించి సిద్ధంగా ఉంచినట్లు సమాచారం.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 54,666 మంది విద్యార్థుల కొలతలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫాంలను ప్రభుత్వం అందజేయాల్సి ఉంది.
విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉండగా, విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బడిబాట, మౌలిక వసతులు, ఇతర విద్యా అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం యూనిఫాంల పంపిణీపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌ను సంప్రదించగా, యూనిఫాంల పంపిణీపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని, ప్రభుత్వం నుంచి వస్త్రాలు అందిన వెంటనే పంపిణీ చేపడతామని తెలిపారు.
