TDP | భయపెట్టే ప్రయత్నం చేసినా..

TDP | భయపెట్టే ప్రయత్నం చేసినా..

  • వైసీపీ పాలన పై కూటమి విష ప్రచారం..
  • మా అభివృద్ధి కనుమరుగు చేసే ప్రయత్నం..
  • పి పి పి తో డబ్బు దండుకునే ఆలోచన….
  • వైద్య కళాశాలల పై ప్రభుత్వ నిర్ణయం దుర్మార్గం..
  • కేసులు పెట్టి భయపెట్టే యత్నం..
  • కోటి సంతకాలకు అనూహ్యస్పందన..
  • కూటమికి ఓటు వేసి తప్పు చేశామంటున్న ప్రజలు…
  • ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టీడీపీ అవినీతి..
  • ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్…
  • తూర్పు నియోజకవర్గంలో 95 వేలకు పైగా సంతకాల సేకరణ…

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందరికీ అందించామని, వాటిని కనుమరుగు చేసే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం (A coalition government) మాత్రం విష ప్రచారం చేస్తుందంటూ ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. పి పి పి విధానంతో పెద్ద ఎత్తున డబ్బు దోచుకోవాలన్న లక్ష్యంతో దుర్మార్గంగా వైద్య కళాశాల పై ఈ నిర్ణయం తీసుకుందంటూ మభ్యపెట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వచ్చింది అన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా తూర్పు నియోజకవర్గం నుండి 95 వేలకు పైగా సంతకాలను సేకరించామని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

విజయవాడలోని తూర్పు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దేవినేని అవినాష్ (Devineni Avinash) ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో 95 వేలకు పైగా సంతకాలను పార్టీ శ్రేణులు, పార్టీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు ఆధ్వర్యంలో సేకరించారు. సంతకాల సేకరణ పూర్తయిన సందర్భంగా గుణదలలో ఉన్న పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ… జగన్ పిలుపు ఇచ్చిన ఏ కార్యక్రమం అయినా తూర్పు నియోజకవర్గంలో విజయవంతం అవుతుందని, ఈ విషయాన్ని స్వయంగా జగన్ మెచ్చుకున్నాట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేశారని, ప్రభుత్వం చేసే తప్పును ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళగలిగినట్లు వివరించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు తూర్పు నియోజకవర్గమే మొదటి స్థానంలో ఉందని, మెడికల్ కాలేజీలు (Medical Colleges) ప్రైవేట్ పరం చేస్తే.. పేద విద్యార్థులకు మెడికల్ విద్య దూరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన తెలుపుతున్నారని అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమన్నారు. జగన్ విలువ ప్రజలు అందరూ ఇప్పుడు తెలుసుకున్నారని, అందుకే కూటమి ప్రభుత్వానికి అనవసరంగా ఓటు వేశామని బాధపడుతున్నట్లు తెలిపారు. జగన్ తెచ్చిన మంచి పథకాలన్నీ కూటమి నేతలు నాశనం చేశారని, రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరన్నారు.

రాష్ట్ర ప్రజలు అందరూ జగన్ వెనకాలే ఉన్నారని, కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేసినా ఎవరు భయపడటం లేదన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే
గద్దె రామ్మోహన్ (Gadde Rammohan) చేస్తున్న అవినీతి అంతా ఇప్పుడు బయటకు వస్తుందని, అక్కడ అనుచరులను పెట్టి దోచుకుంటున్నారని ఆరోపించారు. అంతకుముందు నియోజకవర్గంలో నిర్వహించిన కోటి సంతకాల పత్రాలను పరిశీలించిన ఆయన దేవినేని నెహ్రూ, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply