3rdyearB.Tech | యువతి ఇంటిపై దాడికి యత్నం
3rdyearB.Tech | యువతి ఇంటిపై దాడికి యత్నం
3rdyearB.Tech | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. యావన్ అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జవహర్‌నగర్‌కు చెందిన యావన్ (23) బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సీతాఫల్‌మండికి చెందిన ఓ యువతితో గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో గతంలో యావన్‌ను పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అతను సీతాఫల్‌మండి ప్రాంతంలో స్నేహితుడి వద్ద ఉంటూ యువతిని కలుస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు.
గురువారం రాత్రి మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు యావన్‌పై కత్తులతో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి నుంచి తప్పించుకునేందుకు అతను బయటకు పరుగెత్తినా దుండగులు వెంటాడి విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన యావన్‌ను స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి బంధువులు నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కొందరు యువతి ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
