అంతర్జాతీయ అవార్డు రేసులో APCNF

అంతర్జాతీయ అవార్డు రేసులో APCNF
గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రపంచ ఆహార సంక్షోభంకు పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్ వేస్తున్న అడుగులకు ప్రపంచస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. స్వీడన్‌కు చెందిన ప్రతిష్టాత్మక కర్ట్ బెర్ట్‌ఫోర్స్ ఫౌండేషన్ ప్రకటించిన 2026 ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ తుది విజేతల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (APCNF) స్థానం సంపాదించుకుంది.
ఈ ఎంపిక ద్వారా ఏపీ సుమారు రూ. 1.4 కోట్ల నగదు పురస్కారంను ఇప్పటికే ఖాయం చేసుకోగా, తుది విజేతగా నిలిస్తే దాదాపు రూ. 14 కోట్ల భారీ బహుమతిను అందుకునే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణతో కూడిన ఆహార ఉత్పత్తి విధానాల్లో వినూత్న మార్పులు తీసుకొస్తున్న సంస్థలకు ఈ అంతర్జాతీయ వేదిక అండగా నిలుస్తోంది.
రాష్ట్రంలోని 8 వేలకుపైగా గ్రామ పంచాయతీల్లో సుమారు 18 లక్షల మంది రైతులతో సాగుతున్న ఈ ఉద్యమం, పర్యావరణానికి మేలు చేసే గణాంకాలను నమోదు చేస్తోంది. ముఖ్యంగా రసాయనాల రహిత సాగు వల్ల భూగర్భ జలాల వినియోగం సగానికి పైగా తగ్గడం, భూతాపాన్ని పెంచే గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను గణనీయంగా నియంత్రించడం వంటి ఫలితాలు సాధ్యమవుతున్నాయి.
సుమారు 30 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల పర్యవేక్షణలో, ఒక రైతు నుండి మరో రైతుకు విజ్ఞానాన్ని అందించే విశిష్టమైన వ్యవస్థ ఇక్కడ నిర్మితమైంది. ఈ ఏడాది జూన్‌లో స్వీడన్ వేదికగా జరగనున్న సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తన ప్రతిపాదనలను సమర్పించనుంది.
