ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం..

ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం..

యువకుడిలో ప్రమాదకర ట్యూమర్ తొలగింపు.. మహిళలో కపాల లీక్‌కు క్లిష్ట సర్జరీ..
ఎండోస్కోపీ, ఎంబోలైజేషన్‌తో నిపుణుల సమన్వయం..
రోగులు క్షేమంగా డిశ్చార్జ్.. వైద్య బృందానికి ప్రశంసలు

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన, క్లిష్ట శస్త్రచికిత్సలను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఆధునిక సాంకేతికత, నిపుణుల సమన్వయంతో రెండు కేసుల్లోనూ రోగులను సురక్షితంగా కోలుకునేలా చేశారు. సింగ్‌నగర్‌కు చెందిన 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి రాహుల్ గత కొన్ని నెలలుగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ రక్తస్రావంతో బాధపడుతూ ఈ న్ టీ విభాగాన్ని సంప్రదించాడు.

పరీక్షలలో ఎం ఆర్ ఐ, సిటీ , స్కాన్‌ల ద్వారా అతనికి ‘జువెనైల్ నాసోఫారింజియల్ ఆంజియోఫైబ్రోమా’ అనే ప్రమాదకర ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణైంది. ఈ వ్యాధి సాధారణంగా కౌమార దశలో ఉన్న అబ్బాయిలలో హార్మోన్ల ప్రభావంతో ఏర్పడుతుందని వైద్యులు తెలిపారు. వైద్య బృందం ముందుగా ఎంబోలైజేషన్ చేసి రక్తస్రావాన్ని నియంత్రించి, అనంతరం ఎండోస్కోపిక్ విధానంలో ట్యూమర్‌ను పూర్తిగా తొలగించింది.

ఈ శస్త్రచికిత్స ఈ ఎన్ టి విభాగాధిపతి డా. కొణిదె రవి, మత్తు విభాగాధిపతి డా. వినయ్ కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఏ.వై. రావు సమన్వయంతో విజయవంతంగా పూర్తయ్యింది. రోగిని ఏప్రిల్ 22న డిశ్చార్జ్ చేశారు. ఇక మరో కేసులో, విజయవాడకు చెందిన 33 ఏళ్ల మహిళ పి. రజని కుడివైపు ముక్కు నుండి నిరంతరం నీరు కారడం సమస్యతో ఆస్పత్రికి వచ్చారు. పరీక్షల్లో ఇది ‘సీఎస్‌ఎఫ్ రైనోరియా’గా గుర్తించారు. అంటే కపాలం అడుగు భాగంలో లీక్ కారణంగా మెదడు ద్రవం ముక్కు ద్వారా బయటకు రావడం.

ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైద్యులు ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా లీక్ ఉన్న భాగాన్ని గుర్తించి, తొడ భాగం నుండి తీసిన కండర పొర, కొవ్వు, ఫైబ్రిన్ సీలెంట్‌లతో మూసివేశారు. ఈ శస్త్రచికిత్సను ఈ నెల 16న విజయవంతంగా నిర్వహించి, రోగిని 22న డిశ్చార్జ్ చేశారు. రెండు శస్త్రచికిత్సల్లోనూ ఈ న్ టి సర్జరీ బృందం, అనస్థీషియా నిపుణులు సమన్వయంతో పనిచేశారు. వైద్యుల ప్రతిభ, ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న సదుపాయాలు ఇలాంటి క్లిష్ట చికిత్సలను కూడా విజయవంతంగా నిర్వహించగల సామర్థ్యాన్ని నిరూపిస్తున్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. ఏ.వై. రావు తెలిపారు.

Leave a Reply