మృత్యు మిద్దె

కుప్ప కూలిపోగా .. తండ్రి-కొడుకులు మృతి

ఎమ్మిగనూరులో విషాదం

 ( ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ):

కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండలంలోని గుడేక గ్రామంలో సోమవారం అర్ధరాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసి ముద్దైన ఓ పాత మిద్దె అర్ధరాత్రి అకస్మాత్తుగా కూలిపోయి తండ్రి, కొడుకు దుర్మరణం చెందారు. . గోడ పక్కనే ఉన్న తాత్కాలిక షెడ్‌పై అది కుప్పకూలడంతో అందులో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు  తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దుర్ఘఘటనలో నాగరాజు అలియాస్ శేఖర్ ( 45) అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన 14 ఏళ్ల కుమారుడు లక్ష్మీనరసింహను తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించినా, వైద్యం పొందుతూ కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో నాగరాజు తల్లి లక్ష్మీదేవి, తమ్ముడు రాజు తీవ్రంగా గాయపడి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేదరికంలో జీవనాన్ని గడుపుతున్న ఈ కుటుంబం మట్టి మిద్దె పక్కనే తాత్కాలిక షెడ్‌లోనే జీవనం సాగిస్తోంది. వర్షాలు రావడంతో బతుకుదెరువు కోసం వేసుకున్న తాత్కాలిక నివాసమే వారికీ స్మశానంగా మారడం గ్రామ ప్రజల గుండెల్ని కదిలిస్తోంది.