విద్యుత్ ఘాతంతో యువకుడికి తీవ్ర గాయాలు
108 సిబ్బంది అప్రమత్తతతో ఆసుపత్రికి తరలింపు
రేగొండ, ఆంధ్రప్రభ: రేగొండ మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడగా, 108 సిబ్బంది సకాలంలో స్పందించి ఆసుపత్రికి తరలించిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. 108 సిబ్బంది అందించిన వివరాల ప్రకారం, పోచంపల్లి గ్రామానికి చెందిన బిక్షపతి అనే యువకుడు తన వ్యవసాయ భూమి వద్ద పశువులను మేపుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం కురిసిన గాలివాన కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడి నేలపై పడి ఉన్నాయి.
అయితే ఆ వైర్లు పడి ఉన్న విషయాన్ని గమనించని బిక్షపతి, పశువులు అటువైపు వెళ్తుండటాన్ని చూసి వాటిని పక్కకు తోలే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు అతని కాళ్లకు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే 108కు సమాచారం అందించారు. స్పందించిన 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బిక్షపతికి ప్రథమ చికిత్స అందిస్తూ పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు పరిశీలించగా అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఏంజీఎం ఆసుపత్రికి 108 అంబులెన్స్ ద్వారా తరలించారు. గాయపడిన బిక్షపతిని సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు కృషి చేసిన 108 సిబ్బంది శ్వేత, రషీద్‌లను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.
