సులబ్ కార్మికుల వేతనాల కోసం ఈ నెల 17న సింగరేణి హెడ్ ఆఫీస్ ముట్టడి..
3 నెలలుగా జీతాలు లేవు, 32 నెలలుగా డి.ఏ. ఏరియర్స్ పెండింగ్ – ఐఎఫ్టియు ఆగ్రహం
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : రామకృష్ణాపూర్ సింగరేణి కాలరీస్ పరిధిలోని సులబ్ కాంప్లెక్స్ లలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని సింగరేణి సులబ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ప్రకటించింది.బుధవారం రామకృష్ణాపూర్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. బ్రహ్మానందం అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సులబ్ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, 2023 అక్టోబర్ నుంచి పెరిగిన వేతనాలు, 32 నెలలుగా పెండింగ్ లో ఉన్న డి.ఏ. ఏరియర్స్ ను కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. సులబ్ ఇంటర్నేషనల్, ఉజ్వల్ శానిటైజేషన్ సంస్థల మధ్య కోర్టు వివాదాన్ని సాకుగా చూపి కార్మికులను నిలువునాముంచుతున్నారని మండిపడ్డారు.కనీస సౌకర్యాలు లేకుండా దుర్గంధం మధ్య పని చేయాల్సి వస్తుండడంతో చాలా మంది కార్మికులు వృత్తి సంబంధిత వ్యాధుల బారినపడిచనిపోతున్నారని తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలు, ఇతర కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తున్నట్లుగా 8.33 శాతం బోనస్ ను అమలు చేయాలని, వేతనాలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా నేరుగా చెల్లించాలని, అన్ని సులబ్ కాంప్లెక్స్ లను వెంటనే రిపేర్ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ముత్యాల వెంకటేష్, నరసయ్య, మల్లయ్య, అప్పారావు, శ్రీనివాస్, సత్యం, శివ, ఉమా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
