జాతీయ బాక్సింగ్‌లో కాంస్యం కొట్టిన అమ్రీన్..
ఎల్కతుర్తిలో ఘన స్వాగతానికి ఏర్పాట్లు
పంజాబ్‌లో సబ్ జూనియర్ అండర్-15 జాతీయ బాక్సింగ్‌లో తెలంగాణకు ఏకైక పతకం..
యువ బాక్సర్ విజయంపై హర్షం
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి చెందిన యువ బాక్సర్ ఎండీ అమ్రీన్ పంజాబ్‌లో నిర్వహించిన సబ్ జూనియర్ అండర్-15 జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది. తెలంగాణ రాష్ట్రం నుంచి పతకం సాధించిన ఏకైక బాలికగా గుర్తింపు పొందడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఎల్కతుర్తిలోని శ్రీ చైతన్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అమ్రీన్, ప్రముఖ బాక్సింగ్ కోచ్ దేవరకొండ ప్రభుదాస్ శిక్షణలో ఈ ఘన విజయం సాధించింది. 58–61 కిలోల విభాగంలో కాంస్య పతకంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకుంది.
అమ్రీన్ విజయాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం 4 గంటలకు ఎల్కతుర్తి బస్‌స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ అభినందన ర్యాలీ నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు, యువకులు, సహ విద్యార్థులు తెలిపారు. అనంతరం అమ్రీన్‌కు ఘన సన్మానం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, మహిళలు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్రీన్‌ను అభినందించనున్నారు.
ఈ సందర్భంగా అమ్రీన్ తల్లిదండ్రులు హుస్సేన్, యాకూబీలను పలువురు అభినందించారు. అమ్రీన్ భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణతో పాటు దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
గ్రామ సర్పంచ్ మునిగడప లావణ్య శేషు మాట్లాడుతూ, “ఆడపిల్లలు కూడా క్రీడల్లో అత్యున్నత విజయాలు సాధించగలరని అమ్రీన్ నిరూపించింది. ఆమె విజయం ఎల్కతుర్తి మండల యువతకు స్ఫూర్తిదాయకం. కష్టపడి శ్రమిస్తే లక్ష్యాలను చేరుకోవచ్చని ఈ విజయం చాటిచెబుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా జాతీయ స్థాయికి ఎదగవచ్చని అమ్రీన్ నిరూపించింది” అని కొనియాడారు.
