భారత ఉపరాష్ట్రపతి పర్యటనకు పటిష్ట భద్రత…

భారత ఉపరాష్ట్రపతి పర్యటనకు పటిష్ట భద్రత…

వివిఐపీ బందోబస్తులో అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి జిల్లా ఎస్పీ

శ్రీకాకుళం, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీకాకుళం జిల్లాకు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ 27వ తేదీన పర్యటించనున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన బందోబస్తు విధి విధానాలు, నిర్వహణలపై పోలీసు అధికారులు, సిబ్బందికి ఆదివారం అరసవిల్లి వద్ద జిల్లా ఎస్పీ దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి కాన్వాయ్ ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి 80 అడుగుల రహదారి మార్గం ద్వారా మిల్లీ జంక్షన్, అరసవిల్లి, శ్రీకూర్మం పుణ్యక్షేత్రాల వరకు ప్రయాణించే దృష్ట్యా, మార్గమధ్యంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టాలన్నారు.

అదేవిధంగా కాన్వాయ్ వెళ్ళే సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని, ముఖ్య కూడళ్ల వద్ద నిర్దేశిత స్టాపర్లను ఏర్పాటు చేసి, అదనపు సిబ్బందిని మోహరించాలని ఆదేశించారు. ఉపరాష్ట్రపతి బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని స్పష్టం చేశారు.

రూట్ మొత్తంలో రోడ్ ఓపెనింగ్ పార్టీలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాల ద్వారా విస్తృత తనిఖీలు చేపట్టాలని, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.ఉపరాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణ, హెలిప్యాడ్ ఏర్పాట్లు, రహదారి మార్గ భద్రత, పుణ్యక్షేత్రాల వద్ద భద్రతా చర్యలు, అత్యవసర సేవల సిద్ధత వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి అంశాన్ని సవివరంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎటువంటి లోపాలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని స్పష్టం చేశారు.

పర్యటన సందర్భంగా సుమారు 650 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి పర్యటన ముగిసిన తరువాత విశాఖపట్నం చేరుకునే వరకు ప్రతి ఒక్కరు తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించి బందోబస్తును విజయవంతం చేయాలని సూచించారు.

Leave a Reply