శ్రీకాకుళంలో పారిశ్రామిక యుగానికి నాంది..
శ్రీకాకుళంలో పారిశ్రామిక యుగానికి నాంది..
ఎంఎస్ఎంఈ పార్క్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన!
అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం..
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న రామ్మోహన్ నాయుడు
పొందూరు (శ్రీకాకుళం), ఆంధ్రప్రభ: కష్టపడే వ్యక్తుల జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి అవకాశాలను స్థానికంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
మంగళవారం శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వెంకటరాయునిగూడెం గ్రామంలో రూ.10.45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్క్‌కు పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం నిర్వహించిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, వెంకటరాయునిగూడెం ప్రాంతం నుంచి ఇంటి నిర్మాణానికి పునాది రాయిని తీసుకెళ్లడం ఆనవాయితీగా ఉందని, అలాంటి ప్రాంతంలోనే భవిష్యత్ అభివృద్ధికి పునాది పడటం సంతోషకరమని పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వలసలను గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించడం, ఉపాధిని ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. గతంలో “శ్రీకాకుళం జిల్లాకు పరిశ్రమలు రావు” అనే అభిప్రాయానికి ముగింపు పలుకుతూ, ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా జిల్లాలో కొత్త పారిశ్రామిక యుగానికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
