జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులతో మమేకం
రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో బయాలజీ, 9వ తరగతి విద్యార్థులతో లెక్కలు చేపించి విద్యార్థుల ప్రతిభను గుర్తిoచి అభినందించారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
భవిష్యత్తులో ఏం కావాలని కోరుకుంటున్నారో విద్యార్థులను అడిగి తెలుసుకోగా, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, సాఫ్ట్వేర్, ఉపాధ్యాయులుగా ఎదగాలనుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా వారి లక్ష్యాలను కలెక్టర్ అభినందించారు.కష్టంగా కాకుండా ఇష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని ప్రజలకు సేవ చేసే అవకాశం సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. చెంచుకాలని నుండి వచ్చే విద్యార్థులు సుదూరం కావడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని ప్రధానోపాధ్యాయులు తెలుపగా అట్టి విద్యార్థులకు రవాణా సౌకర్యం లేదా సైకిల్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.ఈకార్యక్రమంలో తహసీల్దార్ శ్వేతరావు , ఎంపిడిఓ వెంకటేశ్వరరావు,ఎంఈఓ.ప్రభాకర్ , పాఠశాల.ప్రధానోపాధ్యాయులు. దేవేందర్ , స్థానిక సర్పంచ్ వారణాసి మౌనిక తదితరులు పాల్గొన్నారు.
