ఆగస్టు 18 నుంచి వన్‌వే అమలు

అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు కొనసాగింపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు అమల్లోకి రానున్నాయి. అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణ పనుల నేపథ్యంలో ఆగస్టు 18 నుంచి కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే విధానాన్ని అమలు చేయాలని ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని ట్రాఫిక్‌ పోలీసు అధికారులు తెలిపారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

ఒకే వైపు ట్రాఫిక్‌ రాకపోకలు

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే మార్గంలో వన్‌వే అమలు చేయనున్నారు. కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఉన్న రెండు లైన్ల రోడ్లలో ఒకే వైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. అయితే చెక్‌పోస్ట్‌ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే మార్గంలో అవసరమైన మేరకు ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. వాహనదారులు సూచించిన మార్గాలను పాటించాలని పోలీసులు కోరారు.

ముందస్తు పరిశీలన తర్వాత నిర్ణయం
ఇటీవల ఒకటి, రెండు ఆదివారాల్లో కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో ప్రయోగాత్మకంగా వన్‌వే విధానాన్ని అమలు చేసిన ట్రాఫిక్‌ పోలీసులు.. ఆ సమయంలో ఎదురైన సమస్యలను గుర్తించారు. ఆయా కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులను పరిష్కరించిన అనంతరం శాశ్వతంగా వన్‌వే అమలు చేయాలని నిర్ణయించారు. నగరంలో కీలకమైన ప్రాంతమైన కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు విజ్ఞప్తి చేశారు.