వాసవి విద్యాసంస్థల్లో ఘనంగా బోనాల సంబరాలు
బోనాలు ఎత్తుకున్న విద్యార్థులు.. పోతరాజుల నృత్యాలతో ఆకట్టుకున్న వేడుకలు
కుంటాల, ఆంధ్రప్రభ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కుంటాల మండలం కల్లూరులోని వాసవి విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులకు బోనాల పండుగ ప్రాముఖ్యత, విశిష్టతను వివరించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
అదేవిధంగా ఆషాఢం గోరింటాకు ఉత్సవాన్ని కూడా నిర్వహించారు. విద్యార్థులు ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు విద్యార్థులు బోనాలు ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. పోతరాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆచారాలు, సంప్రదాయాల పట్ల ఆసక్తి పెరుగుతుందని వాసవి విద్యాసంస్థల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ జానకిరామ్, ప్రిన్సిపల్ సాయిలు, సంతోష్, గట్టుపల్లి శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
