Iran War Crisis-Iran Rejects Trump Talks-Hormuz Strait Tensions Rise | మూసుకుపోతున్న శాంతిమార్గాలు.. హార్ముజ్‌పై పట్టు, హౌతీల దాడులతో ప్రపంచానికి కొత్త ముప్పు
Iran War Crisis-Iran Rejects Trump Talks-Hormuz Strait Tensions Rise | మూసుకుపోతున్న శాంతిమార్గాలు.. హార్ముజ్‌పై పట్టు, హౌతీల దాడులతో ప్రపంచానికి కొత్త ముప్పు
అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ట్రంప్‌తో చర్చలకు ఇరాన్ నిరాకరణ, హార్ముజ్ జలసంధిపై పట్టు, హౌతీల దాడులు, ఒమన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక అంశాలుగా మారాయి.
- ఆంక్షలతో ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా
- ట్రంప్‌తో చర్చలు లేవంటున్న ఇరాన్..
- హార్ముజ్‌పై పట్టు వీడని టెహ్రాన్
- ఎర్ర సముద్రంలో హౌతీల దాడులతో కొత్త ముప్పు
- తెరవెనుక ఒమన్ దౌత్యం.. అమెరికా–ఇరాన్ మధ్య ‘డీల్’కు నిజంగానే ఛాన్స్ ఉందా?
- శాంతి మార్గం పూర్తిగా మూసుకుపోలేదంటున్న నిపుణులు
Iran War Crisis-Iran Rejects Trump Talks-Hormuz Strait Tensions Rise | ఆంధ్రప్రభ వెబ్, అంతర్జాతీయ ప్రతినిధి : పశ్చిమాసియాలో యుద్ధం ఆగే సంకేతాల కంటే.. శాంతి చర్చలకు మార్గాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతోంది. ఒకవైపు అమెరికా ఆంక్షలు, సైనిక ఒత్తిడితో ఇరాన్‌ను ఆర్థికంగా కట్టడి చేయాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇరాన్ హార్ముజ్ జలసంధిని తన ప్రధాన ఒత్తిడి ఆయుధంగా మార్చుకుని.. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం, స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయడం, యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను ముందుకు తెస్తోంది.
ఇంతలోనే మరో సంచలన ప్రకటన వెలుగులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పదవీకాలం ముగిసే వరకు ఆయన ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరపబోమని ఇరాన్ వర్గాలు స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదే సమయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం అమెరికా–ఇరాన్ ఏదో ఒక శాంతి అవగాహనకు దగ్గరగా వచ్చాయని చెబుతున్నారు. అంటే.. మాటల తలుపు మూసుకుపోయిందా? లేక తెరవెనుక మరో తలుపు తెరిచి ఉందా? ప్రస్తుతం దౌత్యంలో ఇదే అతిపెద్ద ప్రశ్న.
ట్రంప్‌తో నేరుగా చర్చలకు ఇరాన్ నో?
ఇరాన్ నుంచి వస్తున్న తాజా సంకేతాలు అత్యంత కఠినంగా ఉన్నాయి. ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగిసే వరకు ఆయన పరిపాలనతో విశ్వసనీయమైన చర్చలకు వెళ్లబోమన్న వైఖరి ఇరాన్‌లో బలపడుతోంది. ఇది కేవలం వ్యక్తిగతంగా ట్రంప్‌పై ఇరాన్‌కు ఉన్న వ్యతిరేకతగా చూడలేం. “అమెరికాతో ఒప్పందం కుదిరినా అది ఎంతకాలం అమలవుతుంది?” అన్న అనుమానం ఇరాన్ వ్యూహంలో కీలకంగా మారింది.
ఇంతకుముందు కుదిరిన అవగాహనలపై అమెరికా వైఖరి మారిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అందుకే ఈసారి మాటల కంటే ముందుగా ఆంక్షల ఎత్తివేత, ఆస్తుల విడుదల, సైనిక చర్యలకు ముగింపు వంటి స్పష్టమైన చర్యలు కావాలని కోరుతోంది.
- ఇక్కడే అసలు ప్రతిష్ఠంభన మొదలవుతోంది..
- హార్ముజ్ తెరవాలంటే ఆరు షరతులు?.. ఇరాన్ హార్ముజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవడానికి అమెరికా పలు చర్యలు తీసుకోవాలని కోరుతోంది. వాటిలో ప్రధానంగా:..
- -ఇరాన్‌పై అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలి.
- -ఇరాన్ చుట్టూ అమెరికా సైనిక ఒత్తిడిని, నౌకాదళ దిగ్బంధనాన్ని నిలిపివేయాలి.
- -ఇరాన్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించాలి.
- -స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి
- -యుద్ధంలో ఇరాన్‌కు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి
- -ఇరాన్, దాని మిత్రదేశాలపై అమెరికా దాడులు, బెదిరింపులకు ముగింపు పలకాలి
అని ఇరాన్ జాతీయ భద్రతా వ్యవస్థ నుంచి డిమాండ్లు వచ్చాయి. ఇది సాధారణ చర్చల ఎజెండా కాదు. హార్ముజ్‌ను తెరవడాన్నే ఆంక్షలు, సైనిక ఉపసంహరణ, ఆస్తుల విడుదల, పరిహారం వంటి విస్తృత రాజకీయ అంశాలతో ముడిపెట్టడం ద్వారా ఇరాన్ తన వద్ద ఉన్న వ్యూహాత్మక బలాన్ని గరిష్ఠంగా వినియోగించుకోవాలని చూస్తోంది.
‘పరిహారం కావాలా? ముందుగా మీరే చెల్లించండి’ – ట్రంప్
ఇరాన్ యుద్ధ నష్టాలకు పరిహారం కోరడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ దశాబ్దాలుగా అమెరికన్లను లక్ష్యంగా చేసుకున్న చర్యలు, ప్రాంతీయ ఘర్షణలు, అమెరికా సైనికుల మరణాలకు కారణమైన ఘటనలకు తానే ముందుగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆయన వాదించారు. అంటే ఇరువైపులా “ముందుగా మీరు నష్టపరిహారం చెల్లించాలి” అనే స్థాయికి వివాదం చేరింది.
దౌత్యపరంగా ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఎందుకంటే పరిహారం అంశం చర్చల్లోకి వచ్చినప్పుడు అది కేవలం ఆర్థిక సమస్యగా ఉండదు. ఎవరు దాడి ప్రారంభించారు? ఎవరు బాధితులు? ఎవరు బాధ్యత వహించాలి? అనే రాజకీయ, న్యాయపరమైన ప్రశ్నలు కూడా ముందుకు వస్తాయి. అందుకే ఈ అంశంపై తక్షణ రాజీకి అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది.
దౌత్య తలుపు మూయలేదు..
ఇక్కడే కథలో మరో కీలక మలుపు ఉంది. ఇరాన్–అమెరికా మధ్య ప్రత్యక్ష రాజకీయ చర్చలు నిలిచిపోయినట్లు సంకేతాలు వస్తున్నప్పటికీ, ఒమన్ మధ్యవర్తిత్వంలో హార్ముజ్ జలసంధిలో నౌకాయానంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మజీద్ అల్ అన్సారీ ప్రకారం.. ఒమన్, ఇరాన్ మధ్య హార్ముజ్‌లో నౌకా రవాణా భవిష్యత్తుపై చర్చలు ఆశాజనకంగా ఉన్నాయి.
ఇది అత్యంత ముఖ్యమైన పరిణామం…
ఎందుకంటే ఇరాన్ అమెరికాతో నేరుగా మాట్లాడకపోయినా.. ఒమన్, ఖతార్, పాకిస్తాన్ వంటి మధ్యవర్తుల ద్వారా సందేశాలు వెళ్లే అవకాశం ఇంకా ఉంది. అంటే శాంతి మార్గం పూర్తిగా మూసుకుపోలేదు. కానీ అది ఇప్పుడు ప్రత్యక్ష దౌత్య మార్గం కాకుండా మధ్యవర్తుల మార్గంగా మారింది.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం పరిస్థితిని మరో కోణంలో చూపించారు. అమెరికా–ఇరాన్ మధ్య “ఏదో ఒక శాంతి అవగాహన లేదా ఒప్పందానికి” రెండు దేశాలు దగ్గరగా వచ్చాయని ఆయన తెలిపారు. గత రెండు మూడు రోజుల సంకేతాలు ఒప్పందానికి అనుకూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది ఇరాన్ కఠిన ప్రకటనలతో పూర్తిగా భిన్నంగా ఉంది. అయితే ఈ రెండింటినీ కలిపి చూస్తే ఒక ఆసక్తికరమైన చిత్రం కనిపిస్తుంది: బహిరంగంగా ఇరాన్–అమెరికా ఒకరిపై ఒకరు కఠిన వ్యాఖ్యలు చేసుకుంటున్నా.. తెరవెనుక మధ్యవర్తుల ద్వారా కనీస అవగాహన కోసం ప్రయత్నాలు జరుగుతున్న అవకాశం ఉంది. ఇదే ప్రస్తుతం దౌత్యానికి మిగిలిన చివరి ఆశ.
అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఆందోళన
హార్ముజ్ జలసంధి కేవలం ఇరాన్, అమెరికా మధ్య వివాదానికి సంబంధించిన ప్రాంతం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు ఇది కీలకమైన సముద్ర మార్గం. ఇక్కడ నౌకా రాకపోకలు గణనీయంగా తగ్గిపోవడంతో చమురు, శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తుల ఎగుమతులు కూడా తీవ్రంగా పడిపోయాయి. ఆగస్టు 7తో ముగిసిన వారంలో హార్ముజ్ ద్వారా క్రూడ్, శుద్ధి చేసిన ఉత్పత్తుల ఎగుమతులు రోజుకు సుమారు 30 లక్షల బ్యారెళ్లకు పడిపోయాయి. అంతకుముందు వారంలో ఇది సుమారు 44 లక్షల బ్యారెళ్లుగా ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన పెరుగుతోంది.
