ఎంఎస్‌పీపై తుమ్మల కీలక భేటీ..
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలపై సమీక్ష
హైదరాబాద్, ఆంధ్రప్రభ: పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై పంట కొనుగోలు చేసేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ గోల్కొండ హోటల్‌లో పత్తి ఎంఎస్‌పీ కొనుగోళ్ల సన్నాహక ఏర్పాట్లపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత పత్తి సంస్థ (సీసీఐ) సీఎండీతో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
రానున్న పత్తి సీజన్‌లో రైతుల నుంచి పత్తిని ఎంఎస్‌పీకి కొనుగోలు చేసే ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించడంపై సమావేశంలో చర్చించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, అవసరమైన మౌలిక వసతులు, రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు.
పత్తిని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ప్రక్రియను వేగంగా పూర్తి చేసేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ఎంఎస్‌పీకి అర్హత ఉన్న పత్తికి రైతులకు సకాలంలో మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో తూకం, నాణ్యత నిర్ధారణ, పంట కొనుగోలు, రైతులకు చెల్లింపులు తదితర ప్రక్రియల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు అందాల్సిన ప్రయోజనాలు సకాలంలో చేరేలా వ్యవస్థను పటిష్టం చేయాలని మంత్రి స్పష్టం చేశారు.
సమావేశంలో సీసీఐ సీఎండీ, వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ మరియు ప్రభుత్వ కార్యదర్శి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌తో పాటు వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రానున్న పత్తి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
