గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు..
డ్రైవర్ సహా 21 మందికి గాయాలు
జంగారెడ్డిగూడెం, ఆంధ్రప్రభ: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో డ్రైవర్ సహా 21 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పలువురికి కాళ్లు, చేతులు విరగగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఇండిగో ప్రైవేట్ బస్సు పుట్లకట్లగూడెం సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో నిద్రలో ఉన్న ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న లక్కవరం ఎస్సై ఎస్కే జబీర్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రికి తరలించారు. బస్సు కేబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ వెంకటేశ్వరరావు, మరో ప్రయాణికుడిని పోలీసులు, స్థానికులు కష్టపడి బయటకు తీశారు. క్షతగాత్రులను టీడీపీ నేతలు కిషోర్, గణేష్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
