ఈడేపల్లిలో ఒక్కసారిగా కలకలం.. ఇద్దరికి గాయాలు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: మచిలీపట్నం ఈడేపల్లిలోని బెల్‌ కంపెనీ వెనుక ప్రాంతంలో బుధవారం ఆక్సిజన్‌ సిలిండర్‌ లీకేజీ ఘటన కలకలం రేపింది. లీకేజీ కారణంగా సిలిండర్‌ అదుపుతప్పి సమీపంలో ఉన్న వాహనాలను ఢీకొట్టడంతో రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారు ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సిలిండర్‌ లీకేజీని అదుపులోకి తీసుకువచ్చారు. భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.