కాంగ్రెస్‌ ఆరోపణలకు సర్పంచ్‌ విష్ణువర్ధిని కౌంటర్‌

హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం.. అంబులెన్స్‌, జిమ్‌ ఏర్పాటుకు చర్యలు

భీమ్‌గల్‌ రూరల్‌, ఆంధ్రప్రభ: నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్‌ మండలం బడా భీమ్‌గల్‌ గ్రామంలో ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్‌ నాయకులు చేసిన ఆరోపణలను సర్పంచ్‌ రాచకొండ విష్ణువర్ధిని శంకర్‌ గౌడ్‌ ఖండించారు. గ్రామ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఆమె తెలిపారు. ఈ మేరకు బుధవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

సొంత ఖర్చుతో అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీపై స్పందిస్తూ.. అంబులెన్స్‌ కొనుగోలుతో పాటు డ్రైవర్‌, నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయని, గ్రామ ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువత కోసం జిమ్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, స్థలం, పరికరాలు, నిర్వహణ అంశాలను పరిశీలించి త్వరలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఉప సర్పంచ్‌పై కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, గ్రామపంచాయతీ నిబంధనల ప్రకారమే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో కాకుండా గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.