విద్యుత్‌ ఉచ్చు తొలగిస్తుండగా బీట్‌ ఆఫీసర్‌ మృతి

వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంట్‌ ట్రాప్‌ బలి.. విధి నిర్వహణలో విషాదం

బూర్గంపాడు, ఆంధ్రప్రభ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అడవి జంతువుల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసినట్లు భావిస్తున్న విద్యుత్‌ కరెంట్‌ ఉచ్చును తొలగించే క్రమంలో అటవీశాఖ బీట్‌ ఆఫీసర్‌ బానోతు నవీన్‌ విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందినట్లు సమాచారం. ముసలమడుగు పంచాయతీ చెరువు సింగారం వెస్ట్‌ బీట్‌ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

వన్యప్రాణుల సంరక్షణ, అక్రమ వేటను అరికట్టే చర్యల్లో భాగంగా అటవీ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్‌ తీగలతో ఏర్పాటు చేసిన ఉచ్చు వారి దృష్టికి వచ్చినట్లు సమాచారం. ప్రమాదకరంగా ఉన్న ఆ ఉచ్చును తొలగించే ప్రయత్నంలో బీట్‌ ఆఫీసర్‌ నవీన్‌ విద్యుత్‌ ప్రవాహానికి గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంతో అటవీశాఖలో విషాదం నెలకొంది. ఘటనపై అటవీశాఖ అధికారులు, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కరెంట్‌ ఉచ్చు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.