లోక్‌సభ ముందుకు జస్టిస్ యశ్వంత్ వర్మ నివేదిక..
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన కమిటీ నివేదికను బుధవారం (ఆగస్టు 12) లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. న్యాయమూర్తుల (విచారణ) చట్టం, 1968 కింద ఏర్పాటు చేసిన ఈ విచారణ కమిటీ నివేదికను లోక్‌సభ సెక్రటరీ జనరల్ సభ ముందు ఉంచనున్నారు..
లోక్‌సభ కార్యకలాపాల ప్రకారం.. విచారణ కమిటీ సమర్పించిన రెండు సంపుటాల నివేదికను (హిందీ, ఇంగ్లిష్ ప్రతులు)తో పాటు విచారణ సమయంలో నమోదు చేసిన మౌఖిక, పత్ర ఆధారాలను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు.
2025లో ఏర్పాటైన విచారణ కమిటీ..
జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలోని ఒక గదిలో కాలిపోయిన కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా 2025 ఆగస్టు 12న ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈ ఏడాది మే నెలలో స్పీకర్‌కు తన నివేదికను సమర్పించింది.
2025 మార్చి 14న, ఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అదుపు చేయడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది, స్టోర్‌రూమ్‌లో కాలిపోయిన నగదును గుర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
కాలిన నగదు వ్యవహారం అనంతరం జస్టిస్ యశ్వంత్ వర్మపై తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, ఆ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆయన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను న్యాయ మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా నోటిఫై చేయలేదు. వివాదం వెలుగులోకి వచ్చిన సమయంలో జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. అనంతరం ఆయనను స్వస్థలమైన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు.
సుప్రీంకోర్టులో పిటిషన్ కొట్టివేత
ఇదిలా ఉండగా.. జస్టిస్ యశ్వంత్ వర్మపై కేసు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. న్యాయవాది ఘన్‌శ్యామ్ ఉపాధ్యాయ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. చౌకబారు ప్రచారం కోసం ఇలాంటి పిటిషన్లు వేయడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయవద్దని సూచిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది.
జస్టిస్ వర్మ పదవికి రాజీనామా చేసినప్పటికీ నేరపూరిత బాధ్యత నుంచి తప్పించుకోలేరన్న పిటిషనర్ వాదనను ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. ఇదే అంశంపై గతంలోనూ వచ్చిన పిటిషన్‌ను కొట్టివేసిన విషయాన్ని గుర్తుచేసింది. విచారణ కమిటీ నివేదిక ఇప్పుడు లోక్‌సభ ముందుకు రానుండటంతో కాలిన నగదు వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైంది.
