Telangana Land Controversy | ఫుడ్ పార్క్ భూముల అమ్మకాలపై వివాదం
Telangana Land Controversy | ఫుడ్ పార్క్ భూముల అమ్మకాలపై వివాదం
Telangana Land Controversy | 84 ఎకరాల ధారాదత్తంపై రైతు సంఘాల ప్రశ్నలు
కేబినెట్ ఆమోదం లేకుండా అమ్మకాలా?
అనుమతులు లేకుండానే విలువైన చెట్ల నరికివేత
Telangana Land Controversy | సత్తుపల్లి, ఆంధ్రప్రభ: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో పారిశ్రామిక వాడ (ఫుడ్ పార్క్) ఏర్పాటు కోసం సేకరించిన భూములు క్రమంగా తరిగిపోతున్నాయి. ఒక్కొక్క ఎకరం ఆంధ్రావాళ్లకు అమ్ముడైపోతున్నాయి. ఇప్పటికే 84 ఎకరాలు అమ్మేసినట్లు తెలుస్తోంది. 2005లో పేద రైతుల నుంచి ఎకరం రూ.2 లక్షల చొప్పున 200 ఎకరాలు ఫుడ్ పార్క్ కోసం సేకరించారు. ఇప్పటివరకు అందులో ఒక్క ఫ్యాక్టరీ కూడా నిర్మించకపోగా, ఇటీవల ఎకరం రూ.20 లక్షల చొప్పున 84 ఎకరాలు ఆంధ్రావాళ్లకు అమ్మేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రజా సంఘాల్లో తీవ్రమైన చర్చకు దారి తీసింది. ఏ ప్రాతిపదికన భూములు ధారాదత్తం చేశారో తెలియడం లేదని రైతు సంఘాలు అంటున్నాయి.
ఫుడ్ పార్క్ భూములు అమ్మే విషయంలోనూ, ధర నిర్ణయించే విషయంలోనూ ఎవరి ఆమోదం తీసుకున్నారో కూడా తెలియడం లేదు. వాస్తవానికి ఈ ఆస్తిపై కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, నాబార్డుకు 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 20 శాతం వాటాలున్నాయి. ఒకవేళ అమ్మాల్సి వస్తే ఈ మూడూ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ, అలాంటివేమీ జరగకుండానే అమ్మకాలు చేసేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సేకరించిన భూమిని ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎకరం లీజు రూ.36 లక్షలుగా నిర్ధారించారు. కానీ, అత్యంత చౌకగా ఎకరం రూ.20 లక్షలకు ఎలా అమ్మారనేదే సందేహం.
కేబినెట్ ఆమోదం ఏదీ?
ప్రభుత్వానికి సంబంధించిన కుంట భూమి అమ్మాలంటే కేబినెట్ ఆమోదం తప్పనిసరి. తర్వాత భూములను బహిరంగంగా వేలం వేయాల్సి ఉంది. ఎక్కువ మొత్తానికి ఎవరు పాడితే వారికే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. ఇవేమీ లేకుండానే అతి తక్కువ ధరకు ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ధారాదత్తం చేయటంలో ఆంతర్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులను అడిగితే, ఏ ప్రాతిపదికన భూములు అమ్మారో తమకు తెలియదంటున్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరం భూమి రూ.50 లక్షలకు పైగా ఉండగా, కేవలం రూ.20 లక్షలకే అమ్మడం వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
అనుమతులు లేకుండానే కలప తరలింపు
దొడ్డిదారిలో ధారాదత్తం చేసినట్లుగా ప్రచారం సాగుతున్న ఈ 84 ఎకరాల్లో మామిడి, వేప, తాటి, రావి తదితర జాతుల విలువైన చెట్లు ఉన్నాయి. అవి తొలగించాలంటే అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. అయితే, నిబంధనలకు భిన్నంగా 10, 15 మొక్కలకు అనుమతులు తీసుకున్న వ్యక్తులు అవే అనుమతులు చూపి మూడు రోజులుగా చెట్లు నరికి కలపను ఆంధ్రకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలోనూ పెద్దమొత్తంలో చేతులు మారాయన్న ఆరోపణ వినిపిస్తోంది. లక్షల విలువ చేసే కలప ఇలా ఆంధ్రకు తరలిపోతుంటే, మొక్క వేసి.. చెట్టుగా పెంచిన మా గుండె తరుక్కుపోతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నట్లు బీజేపీ నేతలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశిస్తున్నట్లుగా తెలిసింది.
