వెనెజువెలాను వణికించిన భూకంపాలు…

తీవ్ర‌త‌ 7.1, 7.5.. భారీగా ప్రాణ‌న‌ష్టం


ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. వరుసగా రిక్టర్ స్కేలుపై 7.1, 7.5 తీవ్రతతో నమోదైన ప్రకంపనలతో రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు బలంగా కంపించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. అనేక మంది బహిరంగ ప్రదేశాల్లోకి చేరుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.

అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ (యూఎస్‌జీఎస్) తెలిపిన వివరాల ప్రకారం, తొలి భూకంపం 7.1 తీవ్రతతో నమోదు కాగా, కొద్ది నిమిషాల వ్యవధిలోనే రెండో భూకంపం 7.5 తీవ్రతతో సంభవించింది. ఈ రెండు ప్రకంపనల కేంద్రం కారకాస్‌కు పశ్చిమాన ఉన్న మోరోన్ సమీపంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భూకంపాలు తక్కువ లోతులో సంభవించడంతో వాటి ప్రభావం మరింత తీవ్రంగా కనిపించింది.

భారీ ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తున్నాయి.

యూఎస్‌జీఎస్ ప్రాథమిక ప్రమాద అంచనా ప్రకారం, భూకంప తీవ్రత, జనసాంద్రత, భవనాల నిర్మాణ నాణ్యతను బట్టి భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే ఇది కేవలం ప్రమాద అంచనా మాత్రమేనని, మరణాల సంఖ్యపై ఇప్పటివరకు వెనెజువెలా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది.

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. భూకంప ప్రభావం వెనెజువెలాతో పాటు బ్రెజిల్, కొలంబియా ప్రాంతాల్లో కూడా కనిపించినట్లు సమాచారం. ప్రారంభంలో కరేబియన్ ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, అనంతరం ప్రమాదం తగ్గడంతో వాటిని ఉపసంహరించారు.

ఇప్పటికే రెండు భారీ భూకంపాల తర్వాత సుమారు 20 వరకు ఆఫ్టర్‌షాక్స్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున దెబ్బతిన్న భవనాల్లోకి వెళ్లవద్దని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.