భూగర్భ జలాల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలి

భూగర్భ జలాల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలి
విశాఖలో విస్తరిస్తున్న డేటా సెంటర్లలు..
పర్యావరణ అధ్యయనాలు తప్పనిసరి..
అంతర్జాతీయ అనుభవాల నుంచి ఏపీ పాఠాలు నేర్చుకోవాలి..
జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వల్లూరు భార్గవ్.
( ఆంధ్రప్రభ విజయవాడ)
అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ డేటా సెంటర్ల ఏర్పాటుతో భూగర్భ జలాల తగ్గుదల, కాలుష్య సమస్యలు తలెత్తుతున్నాయనే నివేదికలు వెలుగులోకి రావడం ఆంధ్రప్రదేశ్‌కు హెచ్చరికగా పరిగణించాలని భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ వల్లూరు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికాలోని మోర్గాన్ కౌంటీ, జార్జియా ప్రాంతాల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని సూచించారు.
విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అనేక డేటా సెంటర్లకు అనుమతులు మంజూరైన నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ సంస్థలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు. భారీ స్థాయిలో నీటి వినియోగం, శీతలీకరణ వ్యవస్థల అవసరం కారణంగా డేటా సెంటర్లు స్థానిక పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. భూగర్భ జలాలు, వ్యవసాయ భూములు, గ్రామీణ బావులు, ప్రజారోగ్యాన్ని రక్షించే దిశగా కఠిన పర్యావరణ ప్రమాణాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు సంబంధిత శాఖలు డేటా సెంటర్ల విస్తరణకు ముందుగా సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనాలు, భూగర్భ జలాల స్థిరత్వ అధ్యయనాలు, నిరంతర కాలుష్య పర్యవేక్షణ చేపట్టాలని భర్గవ్ వల్లూరు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు, అభివృద్ధి అవసరమే అయినప్పటికీ ప్రజల తాగునీటి భద్రత, భవిష్యత్ పర్యావరణ సమతుల్యతను పణంగా పెట్టకూడదని స్పష్టం చేశారు. నష్టం జరిగిన తర్వాత స్పందించే పరిస్థితి రాకుండా ఇప్పుడే కఠిన నియంత్రణ వ్యవస్థలు అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. డేటా సెంటర్ల అనుమతుల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాభిప్రాయ సేకరణ, స్వతంత్ర పర్యావరణ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని భర్గవ్ వల్లూరు పేర్కొన్నారు.
