ప్లాస్టిక్ రహిత గ్రామాలే ఆరోగ్యకర సమాజానికి పునాది

తాడ్వాయి, ఆంధ్రప్రభ: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామాల ఏర్పాటులో భాగంగా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించి ప్రతి ఇంటికి జనపనార (జ్యూట్) సంచులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నేల సారాన్ని దెబ్బతీయడంతో పాటు నీటి వనరులను కలుషితం చేస్తున్నాయని, పశువుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని, ప్లాస్టిక్‌ను కాల్చడం వల్ల వెలువడే విష వాయువులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. మార్కెట్‌కు వెళ్లే ప్రతి ఒక్కరూ జ్యూట్ సంచులను వినియోగించి ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్ సంచులకు పూర్తిగా స్వస్తి పలకాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాల లక్ష్యాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేసి జిల్లాలోని ఇతర గ్రామాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం, ఆర్య క్షత్రియ సంఘం సభ్యులు స్టీల్ ప్లేట్లు, గ్లాసులను విరాళంగా అందజేయగా, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులను కలెక్టర్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్‌.వై. గిరి, గ్రామ సర్పంచ్ నర్సింలు, ఉపసర్పంచ్ నరసారెడ్డి, ఎంపీడీవో భరత్‌కుమార్, తహసీల్దార్ శ్వేత, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.