దేవాలయ స్థలం ఆక్రమణపై సర్పంచ్, కార్యదర్శికి వినతి

దేవాలయ స్థలం ఆక్రమణపై సర్పంచ్, కార్యదర్శికి వినతి
ఊట్కూర్, ఆంధ్రప్రభ:
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని రుద్రనగర్ వీధిలో ప్రభుత్వ, దేవాలయ స్థలాల ఆక్రమణను అడ్డుకోవాలని కోరుతూ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు గురువారం స్థానిక సర్పంచ్ ఎం. రేణుక భరత్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు.
మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ పాత భవనంలో ఇటీవల ఒక ప్రైవేట్ పాఠశాల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, సదరు పాఠశాల నిర్వాహకులు నిర్ణీత హద్దులను అతిక్రమించి, ఆట స్థలం కోసం క్రీడా సామాగ్రిని ఏర్పాటు చేస్తున్నారని నాయకులు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆ ఆక్రమిత స్థలం సమీపంలోని స్వామివారి దేవాలయ పరిధిలోకి వస్తుందని వారు తెలిపారు.
దేవాలయానికి సంబంధించిన స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి ఏర్పాటు చేసిన క్రీడా సామాగ్రిని వెంటనే తొలగించాలని, ఈ అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలోని ప్రభుత్వ మరియు దేవాలయ స్థలాలను కాపాడాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు తారాకృష్ణ, పవన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
