న్యాయ–విద్య రంగంలో విశిష్ట సేవలకు ఘన సన్మానం

న్యాయ–విద్య రంగంలో విశిష్ట సేవలకు ఘన సన్మానం

చిట్టినగర్, ఆంధ్రప్రభ: విద్యా, న్యాయ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ నిరంతర అధ్యయనంతో ముందుకు సాగుతున్న సీనియర్ న్యాయవాది డాక్టర్ పి.బి. విజయకుమార్‌కు కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు.

ఇటీవల ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి “సైకాలజీ, పారాసైకాలజీ” విభాగంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పట్టా సాధించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు, అధికారులు కలిసి డాక్టర్ విజయకుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.

గత 22 సంవత్సరాలుగా కృష్ణా మిల్క్ యూనియన్‌కు న్యాయవాదిగా సేవలందిస్తూ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విజయకుమార్ న్యాయ రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని నాయకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ చట్టాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా మనస్తత్వ విశ్లేషణతో అనుసంధానం చేస్తూ డాక్టర్ విజయకుమార్ చేసిన పరిశోధన న్యాయ విజ్ఞాన ప్రపంచంలో ఒక మైలురాయిగా నిలిచిందని తెలిపారు. న్యాయమూర్తుల ప్రవర్తన, సామాజిక విలువలు, నైతికత తీర్పులపై చూపే ప్రభావాన్ని లోతుగా విశ్లేషించిన ఆయన పరిశోధన మేధోపాటవానికి నిదర్శనమని ప్రశంసించారు.

విద్యా, న్యాయ రంగాల్లో ఆయన సాధిస్తున్న విజయాలు తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశ న్యాయ వ్యవస్థకే గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు. యువ న్యాయవాదులు, విద్యార్థులకు నిరంతర అభ్యాసం, క్రమశిక్షణ, లక్ష్యసాధనకు డాక్టర్ విజయకుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

Leave a Reply