అర్ధరాత్రి అంతర్జిల్లా చెక్‌పోస్ట్‌లో డీసీపీ భాస్కర్ ఆకస్మిక తనిఖీలు
మంచిర్యాల, ఆంధ్రప్రభ : బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన అంతర్జిల్లా చెక్‌పోస్ట్‌ను మంచిర్యాల డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఏ. భాస్కర్ మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేపల్లెవాడ శివారులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో పర్యవేక్షించేందుకే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. విధుల్లో ఉన్న సిబ్బందికి శాఖాపరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.
అక్రమ పశువుల రవాణాపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోందని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసినా, అనుమానాస్పద రవాణా గమనించినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఫిర్యాదు దారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలలో తాండూర్ సీఐ దేవయ్య, బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, తాండూర్ ఎస్సై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
