హామీల అమలుపై దళిత బంధు నేతల హెచ్చరిక..

మంథని, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని దళిత బంధు డివిజన్ రాష్ట్ర అధ్యక్షుడు కోయిల మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం మంథని ప్రెస్ క్లబ్‌లో దళిత బంధు రాష్ట్ర క్రమశిక్షణ కన్వీనర్ గద్దల శంకర్, మంథని డివిజన్ అధ్యక్షుడు ఉట్ల శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కోయిల మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పట్ల కపట ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్న దళిత మంత్రులు కూడా దళితుల సమస్యలపై కనీస శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు.

దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ అంశంలో జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో చర్చించాలని కోరారు.

డిమాండ్లపై స్పందన రాకపోతే మంథని నియోజకవర్గంలోని కమాన్‌పూర్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. దళిత మంత్రుల నియోజకవర్గాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆర్లస్వామి, భూపాలపల్లి జిల్లా దళిత బంధు ఉపాధ్యక్షుడు పులి రామన్న, రాష్ట్ర కార్యదర్శి మంతెన సమ్మయ్య, కళాకారుల పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు దుబాసి శ్రీను, డివిజన్ నాయకులు మేకల వెంకటస్వామి, మడిపల్లి శంకర్, జూల రమేష్, నల్లాల మల్లేష్, వడ్డేపల్లి రమేష్, రత్న రమేష్, రత్న, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply