KTR | మున్సిపల్లో సత్తా చాటుదాం..

KTR | మున్సిపల్లో సత్తా చాటుదాం..

  • కాంగ్రెస్ వి వట్టి మాటలే.. చేసింది శూన్యం..
  • జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం..
  • ప్రతి గడపకు కాంగ్రెస్ బాకీ కార్డు
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR | సిరిసిల్ల, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుదామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇన్చార్జీల‌తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇక స్థానిక ఎన్నికలు ఉండవని, నేరుగా సాధారణ ఎన్నికలే ఉంటాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరుతో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేయాలనే కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని, ఈ అంశం సిరిసిల్ల ప్రజలు, న్యాయవాదులు, మేధావుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. జిల్లాలను ఎత్తివేయడానికి సిద్ధమైన ప్రభుత్వం సెస్ను కూడా ఎత్తివేయడంలో ఆశ్చర్యం లేదన్నారు.

సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో.. బీఆర్ఎస్ పాలనలో ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. “మన పని మనమే చెప్పుకోవాలి.. వేరే ఎవరు చెప్పరు” అని స్పష్టం చేశారు. సిరిసిల్ల మున్సిపాలిటీ గెలవడమే కాదు.. అన్ని వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకొ వాలన్నారు. రేవంత్ రెడ్డి పాలనను తుగ్లక్ తరహా నిర్ణయాల పాలనగా కేటీఆర్ అభివర్ణించారు.

సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ షాక్లో ఉందని, అందుకే కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడానికి భయపడుతోందన్నారు. రాష్ట్రంలో 40 శాతం పైగా సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుందని, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టే స్థానాలను కూడా గెలవలేదన్నారు. సిరిసిల్ల పట్టణం గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉందని, బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యం సాధించామన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సింగిల్ డిజిట్ కూడా దాటలేని పరిస్థితిలో ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రతీ ఇంటికి చెప్పాలని, కాంగ్రెస్ బాకీ కార్డు ప్రతి గడపకు తీసుకెళ్లాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో, వృద్ధులు, మహిళలు, రైతులు, నేతన్నలు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఎంత బాకీ పెట్టిందో ప్రజలకు వివరించాలని సూచించారు.

సంక్రాంతి దాటినా రైతు బంధు రాలేదని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వలేదని, రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు కూడా దిక్కు లేని పరిస్థితి ఉందన్నారు. నేతన్నలకు నిజమైన అండగా నిలిచింది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలను నేరుగా తానే పర్యవేక్షిస్తానని, ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఫీవర్ పట్టుకుందని, సిరిసిల్ల ప్రజలంతా గులాబీ జెండా వైపే ఉన్నారన్నారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, ప్రతి వార్డు ఇంచార్జి ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజల మధ్యకు వెళ్లాలని, అభివృద్ధిని వి వరించి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Leave a Reply