CRIME | రెండు నెలల బిడ్డను నరికి చంపిన తండ్రి

CRIME | రెండు నెలల బిడ్డను నరికి చంపిన తండ్రి

CRIME |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నగరంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి తన రెండు నెలల పసికందును అత్యంత దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తగా, స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

మహారాష్ట్రలోని నయాగావ్‌కు చెందిన యువరాజ్‌, నిజామాబాద్‌లోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన ప్రియాంక ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. తొలినాళ్లలో వారి దాంపత్య జీవితం సాఫీగా సాగినప్పటికీ, అనంతరం భార్యపై యువరాజ్ అనుమానం పెంచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో తరచూ ఆమెను వేధించేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇటీవల ప్రియాంక పుట్టింట్లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారి తనకు పుట్టలేదంటూ యువరాజ్ తరచూ గొడవలకు దిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జూన్ 17న చిన్నారిని ఇంటి నుంచి తీసుకెళ్లిన యువరాజ్, అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పలుమార్లు దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మృతదేహాన్ని రైల్వే పట్టాల సమీపంలో పడేసి పరారయ్యాడు.

సాయంత్రం వరకు భర్త, బిడ్డ ఇంటికి తిరిగి రాకపోవడంతో ప్రియాంక పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పసికందు మృతితో తల్లి ప్రియాంకతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.