Indrakeeladri | వైభవపేతంగా ఆషాడసారె ఉత్సవాలు…

తరలివస్తున్న భక్తులు..
36,246 మంది భక్తుల దర్శనం..
రూ.1.68 లక్షల విరాళాల ఆదాయం
57,279 ప్రసాదాల పంపిణీ..
7,815 మందికి అన్నప్రసాదం
ఇంద్రకీలాద్రిపై వరుణ యాగం..
14 నుంచి 16 వరకు త్రయాహ్నిక వైదిక కార్యక్రమాలు..
16న కృష్ణాజలాలతో ఘటాభిషేకం
సకాల వర్షాలు.. పాడిపంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు

Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై మంగళవారం భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీ కనకదుర్గమ్మవారిని 36,246 మంది భక్తులు దర్శించుకున్నారు. దర్శనం టికెట్లు 5,853 జారీ కాగా, 57,279 ప్రసాద యూనిట్లు పంపిణీ చేశారు. విరాళాల ద్వారా రూ.1,68,908 ఆదాయం సమకూరింది. 269 సేవలు, 722 తలనీలాల సమర్పణలు జరిగాయి. అన్నదాన ప్రసాదాన్ని 7,815 మంది భక్తులు స్వీకరించారు.

వర్షాభిష్టం కోసం వరుణ యాగం..
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పిస్తూ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి 16 వరకు వరుణ యాగం నిర్వహించనున్నారు. దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు మూడు రోజులపాటు వరుణ జపాలు, ప్రత్యేక హోమాలు, ఘటాభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో శీనా నాయక్‌ తెలిపారు.

దుర్గాఘాట్‌, పాత యాగశాలలో వైదిక కార్యక్రమాలు..
14న దుర్గాఘాట్‌లో విఘ్నేశ్వర పూజ, వరుణ అనువాక సహిత పారాయణాలు, పాత యాగశాలలో వరుణ, ఋష్యశృంగ, నవగ్రహ, అష్టదిక్పాలకులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 15న వరుణ అనువాకం, మండప పూజతో పాటు రుద్రహోమం, వివిధ హోమాలు చేపడతారు.

కృష్ణాజలాలతో ఘటాభిషేకం..
16న ఉదయం దుర్గాఘాట్‌ నుంచి పవిత్ర కృష్ణానది జలాలను సేకరించి శ్రీ మల్లేశ్వరస్వామివారికి ఘటాభిషేకం నిర్వహిస్తారు. మహాన్యాస పారాయణం, శత అనువాహక, కారక పారాయణాలు, మండప దేవతా హోమాలు నిర్వహించిన అనంతరం ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతితో మూడు రోజుల వరుణ యాగం ముగుస్తుంది.

అమ్మవారికి ఆషాఢ సారె సమర్పణ…
ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం అన్నదాన విభాగం అధికారులు, సిబ్బంది శ్రీ కనకదుర్గమ్మవారికి భక్తిశ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పించారు. చీర, సారె, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్‌ రాధాకృష్ణ (గాంధీ), ఈవో శీనా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి అలంకారంలో భక్తురాలు..
పాల ఫ్యాక్టరీ ప్రాంతానికి చెందిన దేవి అనే భక్తురాలు కనకదుర్గమ్మవారి అలంకారాన్ని ధరించి ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక అలంకారంలో కనిపించిన ఆమెను తోటి భక్తులు ఆసక్తిగా తిలకించారు.