చేయూత పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం
బూర్గంపహాడ్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పెన్షన్ పథకానికి అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ ఎంపీడీవో జమలారెడ్డి తెలిపారు. ఈ నెల 11 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బుధవారం వెల్లడించారు. అర్హులైన వారు తమ గ్రామపంచాయతీ లేదా మండల పరిషత్ కార్యాలయంలో నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులతో పాటు కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ చికిత్స పొందుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు. ఆయా వర్గాలకు సంబంధించిన అర్హతలు, ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తుతో జత చేయాలని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించబోమని స్పష్టం చేశారు. అర్హులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
