ఎమ్మెల్యే పీఏ పేరుతో కేటరింగ్ వ్యాపారులకు టోకరా..

రూ.1.73 లక్షలు కాజేసిన నిందితుడు అరెస్ట్

గుడివాడ, ఆంధ్రప్రభ: గుడివాడ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు (పీఏ) పేరుతో కేటరింగ్ వ్యాపారులను నమ్మించి రూ.1.73 లక్షలు మోసం చేసిన వ్యక్తిని గుడివాడ తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాచినేని సంతోష్ కుమార్ (28)ను అదుపులోకి తీసుకున్నట్లు గుడివాడ రూరల్ సీఐ ఎస్‌ఎల్‌ఆర్ సోమేశ్వరరావు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు గూగుల్ ద్వారా ఫంక్షన్ హాళ్ల ఫోన్ నంబర్లు సేకరించి, శారీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పి కేటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మించేవాడు. గుడివాడ ఎమ్మెల్యే పీఏ పేరును ఉపయోగించి కమిషన్, అడ్వాన్స్ పేర్లతో బాధితుల నుంచి యూపీఐ ద్వారా డబ్బులు వేయించుకుని అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడు.

ఈ క్రమంలో గుడివాడలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్‌లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పి భ్రమరాంభిక క్యాటరింగ్ యజమాని జాస్తి ఉమామహేశ్వరరావు నుంచి రూ.46 వేల, ఉంగుటూరు మండలం ఇందుపల్లి వి-కన్వెన్షన్ హాల్ పేరుతో కేటరింగ్ మేస్త్రీ జంపాన పూర్ణ రంగప్రసాద్ నుంచి రూ.1.02 లక్షలు, గుడివాడలోని అలంకృత ఫంక్షన్ హాల్ పేరుతో కేటరింగ్ నిర్వాహకుడు నాగరాజు నుంచి రూ.25 వేల వసూలు చేశాడు. ఇలా మొత్తం రూ.1.73 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడిని జూన్ 27న సాయంత్రం లింగవరం అడ్డరోడ్డు వద్ద నిఘా ఏర్పాటు చేసి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఓపీపీఓ మొబైల్ ఫోన్‌తో పాటు రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన సొమ్మును బెట్టింగ్, ఇతర వ్యసనాలకు ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 318(4), సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66(సీ) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కడప టౌన్ పోలీస్ స్టేషన్, జీఆర్‌పీ గుంతకల్, గోవా ప్రాంతాల్లో కూడా అతనిపై మోసం కేసులు నమోదై జైలుకు వెళ్లినట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లాలోని గుడివాడ రూరల్, ఇందుపల్లి, ఉంగుటూరు ప్రాంతాల్లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.

ఫంక్షన్ హాళ్లు, ఎగ్జిబిషన్లు, కేటరింగ్ కాంట్రాక్టులు, కమిషన్ లేదా అడ్వాన్స్ పేరుతో అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాలను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. డబ్బులు చెల్లించే ముందు సంబంధిత ఫంక్షన్ హాల్ యజమానులు లేదా నిర్వాహకులను నేరుగా సంప్రదించి నిర్ధారించుకోవాలని హెచ్చరించారు.