Corporate governance | ప్రజాస్వామ్యానికి సవాల్‌

Corporate governance | ప్రజాస్వామ్యానికి సవాల్‌

Corporate governance | విచారణల్లో ఆలస్యం.. క్రోనీ క్యాపిటలిజంపై సందేహాలు
హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు vs సెబీ స్పందన
అంతర్జాతీయ స్థాయిలో అదానీ గ్రూప్‌ కేసులు
నియంత్రణ సంస్థల పాత్రపై ప్రశ్నలు
అభివృద్ధి vs బాధ్యత.. సమతుల్యత అవసరం

Corporate governance | ప్రజాస్వామ్యంలో చట్టం ముందు అందరూ సమానమనే సూత్రం అత్యంత కీలకం. అయితే శక్తివంతమైన కార్పొరేట్‌ సంస్థలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారనే భావన కలగడం ఆందోళన కలిగించే విషయం. అదానీ గ్రూప్‌, రిలయన్స్‌ అనిల్‌ అంబానీ గ్రూప్‌ వంటి సంస్థలపై జరుగుతున్న విచారణలు ఆలస్యం అవుతున్నాయా, బలహీనపరచబడుతున్నాయా లేదా ఎంపిక చేసుకుని కొనసాగుతున్నాయా అన్న ఆరోపణలు దేశంలో క్రోనీ క్యాపిటలిజంపై మళ్లీ చర్చకు దారి తీశాయి. ఇది ఒక్కో సంఘటనకు మాత్రమే పరిమితం కాదు. ప్రభావశీల సంస్థలపై చర్యలు తీసుకోవడంలో నియంత్రణ సంస్థలు వెనుకంజ వేస్తున్నాయనే పెద్ద సమస్యను ఇది ప్రతిబింబిస్తోంది.

సీబీఐ, ఈడీ వంటి సంస్థలు వేల కోట్ల రూపాయల ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నప్పటికీ, బాధ్యత నిర్ణయించే ప్రక్రియ మందగమనంలో ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి ఉదాహరణగా దాదాపు 73 వేల కోట్ల బ్యాంకు రుణ మోసాలపై రిలయన్స్‌ అనిల్‌ అంబానీ గ్రూప్‌పై జరుగుతున్న విచారణ నిలుస్తోంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు సమర్పించిన నివేదికల ప్రకారం, అనేక కేసుల్లో నిధుల మళ్లింపు, అక్రమాలు వంటి అంశాలు పరిశీలనలో ఉన్నాయి. వేల కోట్ల క్లెయిమ్‌లను చాలా తక్కువ మొత్తాలకు సెటిల్‌ చేసినట్లు ఈడీ పేర్కొనడం కూడా ఆందోళన కలిగిస్తోంది.

ఈ కేసులపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ చేయడం వాటి తీవ్రతను చూపుతుంది. అయితే విచారణ సంస్థలు తమ విధులను స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి న్యాయస్థానం జోక్యం అవసరమవడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. 24 జనవరి 2023న, “షార్ట్‌ సెల్లింగ్‌”లో ప్రత్యేకత కలిగిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కంపెనీ షేరు ధర పడిపోతుందనే అంచనాతో దాని ధరపై పందెం వేస్తూ, అదానీ గ్రూప్‌ అకౌంటింగ్‌ అక్రమాలు, స్టాక్‌ మానిప్యులేషన్‌, షేర్‌ ధరలను పెంచడానికి ఆఫ్‌షోర్‌ షెల్‌ కంపెనీలను ఉపయోగించిందని ఆరోపిస్తూ 106 పేజీల నివేదికను విడుదల చేసింది.

గత వారం ఈ ఆరోపణలలో కొన్నింటిని సెబీ తోసిపుచ్చింది. తన నిబంధనల ప్రకారం అదానీ కంపెనీలు, సంబంధిత పార్టీల మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదని పేర్కొంది. అందువల్ల పెట్టుబడిదారులకు వెల్లడించాల్సిన అవసరం లేదని తెలిపింది. డబ్బులు దారి మళ్లించినట్లు లేదా పెట్టుబడిదారులు నష్టపోయినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కూడా సెబీ స్పష్టం చేసింది. అదానీ కంపెనీలు తీసుకున్న రుణాలను దర్యాప్తు ప్రారంభానికి ముందే చెల్లించాయని తెలిపింది. ఆరోపణలను మోసపూరిత లావాదేవీలుగా లేదా అన్యాయ వాణిజ్య పద్ధతులుగా వర్గీకరించలేమని నిర్ధారించింది. రాయిటర్స్‌ ప్రకారం, సెబీ రెండు అభియోగాలను తొలగించినప్పటికీ, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నుంచి పబ్లిక్‌ ఫ్లోట్‌ ఉల్లంఘనల వరకు 22 కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

అదానీ గ్రూప్‌ దేశీయంగా, అంతర్జాతీయంగా పలు కీలక చట్టపరమైన మరియు నియంత్రణ సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అమెరికా మరియు భారతదేశంలో కొనసాగుతున్న కేసులు లంచాలు, ఆర్థిక అక్రమాలు వంటి అంశాలకు సంబంధించినవిగా ఉన్నాయి. 2024 నవంబరులో అమెరికా ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు గౌతమ్‌ అదానీ, సాగర్‌ అదానీ తదితరులపై కేసు నమోదు చేశారు. భారత ప్రభుత్వ అధికారులకు 250 మిలియన్‌ డాలర్లకు పైగా లంచాలు ఇచ్చి సౌర విద్యుత్‌ ప్రాజెక్టులను పొందేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2026 మార్చి నాటికి ఈ కేసు విచారణలో కొనసాగుతోంది.

నిందితులకు సమన్లు అందించడంలో ఆలస్యం జరుగుతోంది అని అమెరికా అధికారులు పేర్కొంటూ, ప్రత్యామ్నాయ మార్గాల్లో నోటీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. గౌతమ్‌ అదానీ ఈ సివిల్‌ కేసులో నోటీసులు స్వీకరించడానికి అంగీకరించి, నిర్ణీత గడువులో స్పందించాల్సి ఉంది. ఈ కేసు అంతర్జాతీయంగా ప్రభావం చూపింది. కొన్ని విదేశీ ప్రాజెక్టులు రద్దయ్యాయి. రేటింగ్‌ సంస్థలు కొన్ని కంపెనీలపై “నెగటివ్‌ అవుట్‌లుక్‌” ప్రకటించాయి. గ్లోబల్‌ బ్యాంకులు కొత్త రుణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.

బాంబే హైకోర్టు తీర్పు అదానీ గ్రీన్‌ ఎనర్జీపై సీబీఐ దర్యాప్తు కోరిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పిటిషన్‌ విదేశీ ఆరోపణలపై ఆధారపడిందని, దేశీయంగా సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ దీనిని “దుర్వినియోగం”గా అభివర్ణించింది. ఇది సీబీఐ దర్యాప్తు డిమాండ్‌కు ఊరటనిచ్చిన తీర్పుగా భావిస్తున్నారు.

జేపీ అసోసియేట్స్‌ కొనుగోలు కేసులో, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ సంస్థ జేపీ అసోసియేట్స్‌ లిమిటెడ్‌ను 14,535 కోట్లకు కొనుగోలు చేయడానికి నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చింది. అయితే వేదాంత లిమిటెడ్‌ ఈ ఒప్పందాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కర్ణాటకలో ఏసీసీ లిమిటెడ్‌కు సంబంధించిన 850 కోట్ల బకాయిలపై వివాదం కొనసాగుతోంది. అలాగే బీహార్‌లో అదానీ పవర్‌ ప్రాజెక్టుపై వ్యతిరేక వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇవి ఇంకా పరిష్కారం కాని అంశాలుగా ఉన్నాయి.

ప్రభుత్వం తరఫున వాదించే వారు పెద్ద కార్పొరేట్‌ సంస్థలు ఆర్థికాభివృద్ధికి, మౌలిక సదుపాయాల నిర్మాణానికి, ప్రపంచ పోటీతత్వానికి అవసరమని చెబుతారు. ఈ వాదనలో కొంత నిజం ఉన్నప్పటికీ, అది బాధ్యత నుంచి మినహాయింపుకు కారణం కావద్దు. ఆర్థిక అభివృద్ధి, నైతిక పరిపాలన కలిసి నడవాల్సిందే.

డా. ముచ్చుకోట సురేష్‌ బాబు
9989988912

Leave a Reply