హోటళ్లలో యదేచ్ఛగా డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం

హోటళ్లలో యదేచ్ఛగా డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం

అరకొర తనిఖీలు , పట్టించుకోని అధికారులు

జనగామ అర్బన్, ఆంధ్రప్రభ : ప్రపంచంలో నెలకొన్న యుద్ద పరిస్థితుల్లో గ్యాస్ సరిపడా తగ్గడంతో కమర్షియల్ సిలిండర్ లను ప్రభుత్వం సరఫరా నిలిపివేయడంతో హోటళ్ల యజమానులు అడ్డదారుల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తూ ధరలు పెంచి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో హోటళ్లలో వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లపై ప్రత్యేక కథనం.. జనగామ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున వెలసిన హోటళ్లలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో గృహాల్లో ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ లను అధిక ధరలకు కొనుగోలు చేస్తూ వినియోగిస్తున్నారు. దీంతో హోటళ్లలో టిఫిన్లు, భోజనం ధరలు పెంచేశారు. కొన్ని హోటళ్లలో నేరుగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ లను వినియోగిస్తుండగా మరికొన్ని హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్ల గ్యాస్ ను కమర్షియల్ సిలిండర్ల లో నింపి వినియోగిస్తున్నారు. గత 20 రోజుల నుండి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల
సరఫరా నిలిపివేయడం జరిగిందని అయినప్పటికీ హోటళ్లలో కమర్షియల్సి లిండర్ కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది అని పలువురు తెలిపారు.

తొలత గ్యాస్ సరఫరా సరిగా లేదని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు .ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం భరోసా ఇవ్వడంతో ప్రజల ఆందోళన క్రమంగా తగ్గింది. ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ల సరఫరా నుండి నిలిపివేయడంతో పలు హోటళ్లు కొద్దిరోజుల పాటు మూత పడ్డాయి .కాగా గృహ వినియోగదారులు కొంతమంది డొమెస్టిక్ సిలిండర్లను 2,000 నుండి 3000 వరకు అక్రమంగా అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధిక ధరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ దొరకడంతో కొంతమంది హోటల్ యజమానులు నేరుగా డొమెస్టిక్ సిలిండర్ను వాడుతుండగా మరికొంతమంది డొమెస్టిక్ సిలిండర్ ల నుంచి కమర్షియల్ సిలిండర్ల లో గ్యాస్ నింపి వినియోగిస్తున్నారు.

తొలత అధికారులు హడావుడి చేసి డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగిస్తున్న హోటళ్ల పై దాడులు చేసి డొమెస్టిక్ సిలిండర్ లను స్వాధీనం చేసుకొని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ జనగామలో హోటళ్లలో పెద్ద ఎత్తున డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం యదేచ్చగా జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు. హోటళ్లలో టిఫిన్ ధరలు ఐదు రూపాయల నుండి పది రూపాయల వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నారని పలువురు తెలిపారు.

గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కొత్త కనెక్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని సమాచారం. అధికారులు ఇకనైనా డొమెస్టిక్ సిలిండర్లా వినియోగాన్ని హోటళ్లలో తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.