పర్వతగిరిలో ఘోర విషాదం
పర్వతగిరిలో ఘోర విషాదం
• ఒకే ప్రమాదంలో నలుగురు బలి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబాలు
• మైనర్ విద్యార్థితో పాటు ఇద్దరు రైతులు, మరో యువకుడి మరణం
• తూరుకల సోమారం, పర్వతగిరి గ్రామాల్లో విషాద ఛాయలు
వరంగల్ జిల్లా (పర్వతగిరి), ఆంధ్రప్రభ : పర్వతగిరి మండల కేంద్రంలో జరిగిన ఘోర రహదారి ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మోడల్ స్కూల్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు అత్యంత వేగంగా ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో మొదట ఒకరు మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మిగిలిన ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య నలుగురికి చేరింది. ఒకే ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో పర్వతగిరి, తూరుకల సోమారం గ్రామాల్లో ఊహించని గుండెకోత మిగిలింది.
ప్రమాదం జరిగిందిలా..
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ సమీపంలో రెండు బైకులు అత్యంత వేగంగా ఒకదానినొకటి బలంగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసం అవ్వగా, వాటి పై ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన బుద్ధ చరణ్ (16) అనే మైనర్ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చికిత్స పొందుతూ మిగిలిన ముగ్గురి మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా తీవ్రంగా గాయపడిన మిగతా ముగ్గురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. భారీగా రక్తస్రావం జరగడం, పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో చికిత్స పొందుతున్న వారు కూడా మరణించినట్లు సమాచారం.
మృతుల పూర్తి వివరాలు..
- బుద్ధ చరణ్ (16) తండ్రి విజేందర్, పర్వతగిరి గ్రామం. (మైనర్ విద్యార్థి – ఘటన స్థలంలోనే మృతి)
- వల్లంకొండ ఎల్లం గౌడ్ (58) తండ్రి కాశీం, తూరుకల సోమారం గ్రామం. (వృత్తి: వ్యవసాయం)
- ఎండి. అహ్మద్ (58) తండ్రి ఎండి. అబ్జర్ అలీ, తూరుకల సోమారం గ్రామం. (వృత్తి: వ్యవసాయం)
- గుర్తుతెలియని యువకుడు.. మృతుడు బుద్ధ చరణ్ స్నేహితుడు.
మండలంలో మిన్నంటిన రోదనలు..
సమాచారం అందుకున్న పర్వతగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కళ్లముందే తిరిగిన విద్యార్థి, కష్టపడి పని చేసుకునే ఇద్దరు రైతులు, మరో యువకుడు ఇలా ఒకే ప్రమాదంలో నలుగురు మరణించడంతో బాధిత కుటుంబాల్లో, గ్రామాల్లో రోదనలు మిన్నంటాయి. పర్వతగిరి మండల వ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
