తిరుచానూరు రైల్వే స్టేషన్ నిర్మాణం
తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభం
తిరుపతిపై ఒత్తిడి తగ్గించేందుకు తిరుచానూరు స్టేషన్
తిరుచానూరు – తిరుపతికి క్లస్టర్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి
రైల్వే సీసీఐ శ్రీకాంత్
రేణిగుంట, ఆంధ్రప్రభ : కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి దర్శనార్థం దేశ నలువైపులా నుంచి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుచానూరు రైల్వే స్టేషన్‌ను రూ.120 కోట్ల వ్యయంతో నిర్మించారు. రేణిగుంట తిరుపతి రైల్వే స్టేషన్‌పై విపరీతమైన రద్దీ ఒత్తిడి తగ్గించడం కోసం తిరుచానూరు రైల్వే స్టేషన్ ను ఆధునికీకరణతో రూపుదిద్దారు. తిరుమలకు చేరుకునే భక్తులు ప్రతి ఏడాది విపరీతంగా పెరుగుతుండడంతో రైల్వే అధికారులు తిరుపతి రైల్వే స్టేషన్ పై భారం తగ్గించేందుకు తిరుచానూరు రైల్వే స్టేషన్‌ను సిద్ధం చేశారు.

దక్షిణ మధ్య రైల్వే తిరుచానూరు రైల్వే స్టేషన్‌ను క్లస్టర్ స్టేషన్‌గా అభివృద్ధి చేసి రైళ్ల రాకపోకలను ప్రారంభించినట్లు రైల్వే సీసీఐ శ్రీకాంత్ అన్నారు. సుమారు రూ.120 కోట్ల వ్యయంతో ఆధునికీకరణ పనులు పూర్తిచేసి, దశలవారీగా తిరుచానూరు నుండి రైళ్లు నడపడం ప్రారంభించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రథమ దశలో చెన్నై, అరక్కోణం దిశలకు రెండు రోజువారీ రైళ్లు తిరుచానూరు రైల్వే స్టేషన్ నుండి నడుస్తుండగా.. సుమారు 10 జతల ప్రత్యేక రైళ్లు కూడా ఇక్కడి నుంచే నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
తిరుచానూరు స్టేషన్ తిరుపతికి 6 కిలోమీటర్లు, రేణిగుంటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉందని భక్తుల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో పిట్‌లైన్లు, స్టేబ్లింగ్ లైన్లు ఏర్పాటు చేసి, తిరుపతి స్టేషన్‌పై ఉన్న ఆపరేషనల్ ఒత్తిడిని తగ్గించాలనే ప్రణాళికను రైల్వే శాఖ రూపొందిస్తుందన్నారు. తిరుపతి బదులు తిరుచానూరులోనుంచి వీక్లీ రైళ్లు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుందన్నారు.
దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి నడిచే 10 వారపు ప్రత్యేక రైళ్లు ఇకపై తిరుచానూరు స్టేషన్ నుంచి నడుపుతామని పేర్కొన్నారు.
ఆపరేషనల్ కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 9 నుంచి దశలవారీగా అమల్లోకి వస్తుందన్నారు. ఈ మార్పు వల్ల జల్నా, చర్లపల్లి, సికింద్రాబాద్, నాందేడ్ వెళ్లే రైళ్లు ప్రభావితం అవుతాయన్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం రైళ్లు తిరుచానూరులో చేరుకొని బయలుదేరు సమయాలు మార్చిన మధ్యలోని స్టేషన్ల టైమింగ్స్‌లో మార్పు ఉండదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు తిరుచానూరు స్టేషన్ సవరించిన సమయాలను ముందుగానే చెక్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు. తిరుచానూరు రైల్వే స్టేషన్ ప్రారంభం కావడంతో శ్రీవారిభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

