కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రద్దుకు కుట్ర..
- పథకాలను కొనసాగించకపోతే దశలవారీ ఉద్యమాలు
వాజేడు, ఆంధ్రప్రభ : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెనుమల్ల కృష్ణారెడ్డి ఆరోపించారు. పేదింటి ఆడబిడ్డల కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన ఈ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 2014లో ప్రారంభించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఇప్పటివరకు 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు రూ.13 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు కృష్ణారెడ్డి తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద రూ.1,00,116తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టులో కేసు వేయించి, న్యాయస్థానం ఆదేశాల పేరుతో పథకాలను నిలుపుదల చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ పథకాలను యథావిధిగా కొనసాగించకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని కోరుతూ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నూగురు వెంకటాపురం మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, మండల ఉపాధ్యక్షుడు కొత్తగట్టు సాంబమూర్తి, మండల యువజన విభాగం అధ్యక్షుడు మోడిగ తిరుపతి, కార్యదర్శి బొల్లె ఆదినారాయణ, మాజీ ఉపసర్పంచ్ కల్లూరి సతీష్, మాజీ కోఆప్షన్ సభ్యుడు నిజాముద్దీన్, మాజీ ఉపసర్పంచ్ తోట నరసింహులు, ఎస్సీ సెల్ నాయకులు చెన్నం సాంబశివరావు, వెంకటరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
